
- ఈ నెల 20 నుంచి 22 వరకు కార్యక్రమం: డీజీపీ జితేందర్
హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళా పోలీసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ జితేందర్ అన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 20, 21, 22న రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ‘విమెన్ ఇన్ పోలీస్’ పేరుతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌తో కలిసి గురువారం ఆయన పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళా పోలీసుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కాన్ఫరెన్స్‌లో యూనిఫామ్ సర్వీసెస్ నుంచి 400 మందికి పైగా మహిళా సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. పనిచేసే ప్రాంతాల్లో వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు.
సదస్సులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా జెండర్ పాలసీని రూపొందిస్తామని తెలిపారు. దీని ద్వారా డిపార్ట్‌మెంట్‌లో లింగ సమానత్వంతో పాటు మహిళా పోలీసులకు ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. కాగా.. ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో నిందితులను ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌లుగా గుర్తించామన్నారు.