హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మహిళా సంఘాల సభ్యులను పొదుపుకే పరిమితం చేయకుండా.. సంపద సృష్టికర్తలుగా మార్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా సోమవారం వికారాబాద్, మధిర ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యలకు మంజూరైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. మొత్తం 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు మహిళా సంఘాలకు కేటాయించగా.. తొలి దశలో 6 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. మహిళా సంఘాలే ఈ ప్లాంట్లను నిర్వహిస్తూ.. విద్యుత్‌ను విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందనున్నాయి.
8 వేల భవనాలకు భూమి పూజ..
మహిళా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు భూమిపూజ చేయనుంది. మహిళా సమాఖ్యలకు స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో కొనుగోలు చేసిన 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన బస్సులు జిల్లాల వారీగా టీజీఎస్ఆర్టీసీకి అనుసంధానం కానున్నాయి. ఇప్పటికే రూ.1,397 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించగా.. వారోత్సవాల్లో భాగంగా మరో రూ.650 కోట్లు విడుదల చేయనున్నారు. ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా.. ఇప్పటికే రూ.60,487 కోట్లు ఇచ్చారు.
ఉత్తమ సంఘాల మహిళలకు సన్మానం
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు అన్ని మండల సమాఖ్యలు, ఏరియా లెవెల్ ఫెడరేషన్లలో సోమవారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంఘాల మహిళలను సన్మానించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా స్థాయిలో లోన్ మేళాలు నిర్వహించనున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, వ్యవసాయేతర రంగాల్లో కొత్త జీవనోపాధి యూనిట్లను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్‌లోని కొమరం భీమ్ భవన్లో ఇంక్యుబేటర్ ప్రోగ్రాంను ప్రారంభిస్తారు. బ్యాక్ యార్డ్ కోళ్ల యూనిట్లు, కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, షేడ్ నెట్లు, గోదాంల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
నేటి నుంచి మహిళా వారోత్సవాలు
‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభించి, ఈ నెల 31 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రదర్శనలు, ఆరోగ్య శిబిరాలు, యువతులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు.
