ఏప్రిల్ నెలలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల నియామకం : మంత్రి దామోదర రాజ నర్సింహ

ఏప్రిల్ నెలలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల నియామకం :  మంత్రి దామోదర రాజ నర్సింహ
  • రెండేండ్లలో దాదాపు 10 వేల పోస్టులు భర్తీ చేశాం: మంత్రి దామోదర
  •     7 వేలకు పైగా పోస్టుల రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రక్రియ తుది దశలో ఉంది 
  •     సర్కారు హాస్పిటళ్లలో ప్రైవేట్ మెడికల్ షాపులు బంద్ చేస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గడిచిన రెండేండ్లలో దాదాపు 10 వేల పోస్టులను భర్తీ చేశామని.. మరో 7 వేలకు పైగా పోస్టుల రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రక్రియ తుది దశలో ఉందని ఆయన వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది కొరతపై సభ్యులు తక్కళ్లపల్లి రవీందర్, బండ ప్రకాశ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒకేసారి భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో డాక్టర్ల కొరత తీవ్రమైందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు కావాల్సిన అర్హతలు ఉన్న డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ పోస్టుల భర్తీ ఇబ్బందిగా మారిందని వివరించారు. అయినప్పటికీ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,200 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేశామని ఆయన పేర్కొన్నారు.

అలాగే, వైద్య శాఖలో వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి సంబంధించిన గడువులను మంత్రి ప్రకటించారు. రెగ్యులర్ బేసిస్‌‌‌‌‌‌‌‌లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని.. ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం మరో నెలరోజుల్లో ముగుస్తుందన్నారు. ఇప్పటికే 7 వేల మందిని నియమించామని, మరో 2,312 పోస్టుల భర్తీ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో పూర్తి చేస్తామన్నారు. గత రెండేండ్లలో 1,500 మందిని నియమించినట్టు వెల్లడించారు. 

ప్రైవేటు షాపులకు నో పర్మిషన్

తమ ప్రభుత్వం వచ్చాక గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొత్తగా ఏ ఒక్క ప్రైవేటు షాపునకు పర్మిషన్ ఇవ్వలేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండలిలో సభ్యుడు ఎల్.రమణకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో ఉన్న వాటిని కూడా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని.. అయితే, కొన్ని షాపుల యజమానులు కోర్టు నుంచి స్టే తెచ్చుకుని కొనసాగుతున్నారని తెలిపారు.

కోర్టు నుంచి అనుమతి రాగానే వాటిని తొలగిస్తామన్నారు. ప్రజలకు చౌకగా మందులు అందేలా జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్స్​ లో మొత్తం 65 మెడికల్ షాపులుంటే.. దాంట్లో ఆరు ప్రైవేటు బ్రాండెడ్ మెడికల్ షాపులు ఉన్నాయని చెప్పారు.