డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఏఐ ఆధారిత సేవలు

డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఏఐ ఆధారిత సేవలు
  •     రవాణాశాఖ స్పష్టం
  •     మానవ జోక్యం తగ్గించి పూర్తి పారదర్శకత
  •     వీడియో అనలిటిక్స్ విధానంతోనే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీలో మానవ జోక్యాన్ని తగ్గించి, పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలను వినియోగించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లను ఆధునీకరించి, ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ విధానంతోనే పరీక్షలు నిర్వహిస్తామని రవాణాశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నగరంలోని నాగోల్, కొండాపూర్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే ఢిల్లీ, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌‌‌‌‌‌‌‌ల విధానాన్ని కమిటీ సభ్యులు అధ్యయనం చేసి నివేదిక సమర్పించారని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా మొదటి దశలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఐదు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లతోపాటు కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని రవాణా శాఖ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌‌‌‌‌‌‌‌ను ఆధునీకరిస్తామని తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఏఐ ఆధారిత సేవల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ల జారీకి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ విధానం అమలు చేసేందుకు రవాణా శాఖ, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ఆయన వెంట డీటీసీ రవీందర్, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ అధికారులు శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, విక్రమ్, ఆర్టీవో కొండయ్య తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.