తెలంగాణ వర్సిటీ వీసీకి చెక్​... వైస్​ చాన్స్​లర్​ రవీందర్​ గుప్తా అధికారాల కుదింపు

తెలంగాణ వర్సిటీ వీసీకి చెక్​...  వైస్​ చాన్స్​లర్​ రవీందర్​ గుప్తా అధికారాల కుదింపు
  • తెలంగాణ వర్సిటీ వీసీకి చెక్​
  • వైస్​ చాన్స్​లర్​ రవీందర్​ గుప్తా అధికారాల కుదింపు
  • త్రీమెన్​ కమిటీకి నిర్వహణ బాధ్యతల అప్పగింత 
  • 130 మంది ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల తొలగింపు

నిజామాబాద్,  వెలుగు :  నిజామాబాద్​ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు హాట్​టాపిక్​గా మారాయి. వీసీ  రవీందర్​ గుప్తా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు రావడం, బుధవారం హైదరాబాద్​లో పాలకమండలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోవడం, వీసీ అధికారాలను కత్తిరిస్తూ అమలు చేయడం చర్చనీయాంశమైంది.  

రూల్స్​ ఏమిటంటే...

యూనివర్సిటీల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఈసీ సమావేశం ఏర్పాటు చేసి వారి ఆమోదంతోనే అమలు పరచాలి. కానీ, తెలంగాణ యూనివర్సిటీలో 2021 నవంబర్​ 27 తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఒక్కసారి కూడా ఈసీ సమావేశం నిర్వహించలేదు.  ఈ రెండేండ్లలో రిజిస్ట్రార్లుగా కనకయ్య, యాదగిరి,శివశంకర్, విద్యావర్ధిని పనిచేయగా ఇందులో ఈసీ ఆమోదం పొందిన అధికారి యాదగిరి ఒక్కరు మాత్రమే. అలాగే రోజువారి కూలీలతో పాటు ఔట్​సోర్సింగ్​పద్ధతిలో 130 మంది ఉద్యోగులను ఈసీ సమావేశం పెట్టకుండానే నియమించారు. కొందరికి పాత తేదీలపై ప్రమోషన్లు ఇచ్చి ఏరియర్స్​గా రూ.లక్షలు మంజూరు చేసినట్టు కూడా తేలింది. వర్సిటీలో రూ.20 కోట్ల చొప్పున సైన్స్, హాస్టల్ ​బిల్డింగ్స్​నిర్మించడం, 2021–--22 , 2022–23 సంవత్సరాల్లో రూ.90 కోట్ల చొప్పున బడ్జెట్​రూపొందిం సర్కారు నివేదించడం ఇలా అన్నీ ఈసీ ఆమోదం లేకుండానే జరిగాయి. అవసరం లేకపోయినా ఫర్నిచర్​ కొన్నారన్న ఆరోపణలు వచ్చాయి. 2014లో నియమితులైన వారికి పదోన్నతులు ఇవ్వడానికి  రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు డిమాండ్​ చేస్తున్నారనే సమాచారం ఉన్నతాధికారులకు చేరింది. 

ఉన్నతాధికారుల్లో కదలిక..నిర్ణయాలు చకచక 

యూనివర్సిటీలో విషయాలను తెలుసుకున్న ఉన్నతాధికారులు బుధవారం హైదరాబాద్​లో పాలకమండలి సమావేశం నిర్వహించారు. కాలేజీయేట్​కమీషనర్​నవీన్​మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాల్గొన్న ఈ మీటింగ్​లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అడ్డదారిలో నియామకమైన 130 మందిని డ్యూటీలకు రానివ్వొద్దని, ఇప్పటివరకు పొందిన జీతాలను రికవరీ చేయాలని ఆదేశించారు. అమలు బాధ్యతను ఈసీ మీటింగ్​ ఆమోదం పొంది రిజిస్ట్రార్​ అయిన యాదగిరికి అప్పగించారు. దీంతో గురువారం వర్సిటీకి వచ్చిన సదరు ఉద్యోగులను విధులకు రావొద్దని రిజిస్ట్రార్​ యాదగిరి తిప్పి పంపారు.  

వీసీ అధికారాలకు కత్తెర 

బుధవారం సమావేశంతో పాటు గురువారం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వైస్​ ఛాన్సలర్​ రవీందర్ ​గుప్తా అధికారాలను కత్తిరించారు. చెక్​పవర్​ను తొలగించారు. నిర్వహణ అధికారాలను త్రీమెన్​ కమిటీకి అప్పగించారు. కమిటీ మెంబర్స్​గా రవీందర్​రెడ్డి, ఆరితి, నసీమ్​ వ్యవహరిస్తారు. రిజిస్ట్రార్​తో సమన్వయం చేసుకొని ఉన్నతాధికారుల అనుమతితో వీరు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్​ నిర్వహిస్తారు.  వీసీ నిర్ణయాలపై ఫైవ్​మెన్ ​కమిటీతో విచారణ చేయిస్తామని నవీన్​మిట్టల్​ఇదివరకే  ప్రకటించారు.