పల్లె సమాచారం అరచేతిలో..-టెక్నాలజీ బాటలో గ్రామాలు

పల్లె సమాచారం అరచేతిలో..-టెక్నాలజీ బాటలో గ్రామాలు
  •     మొబైల్​ యాప్, వెబ్​సైట్ల ఏర్పాటు

వేములవాడరూరల్/బోయినిపల్లి, వెలుగు: గ్రామపంచాయతీల్లో జరిగే పనుల వివరాలు తెలుసుకోవాలన్నా.. సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలన్నా.. గ్రామసభ తీర్మానాలు, జరిగిన పనులను పరిశీలించాలన్నా.. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్​లైన్​లో పొందుపర్చుతున్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ది, సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామస్తులకు తెలిసేలా కొత్తగా ఎన్నికైన సర్పంచులు డిజిటల్​ టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇందుకు నిదర్శనమే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక, వేములవాడ రూరల్​ మండలం మల్లారం గ్రామాలు. 

మల్లారం సర్పంచ్​ సంగెం అర్పిత, కొదురుపాక సర్పంచ్​ కత్తెరపాక మంజుల డిజిటల్​ వ్యవస్థపై పూర్తి పట్టు సాధించేలా ఈ యాప్, వెబ్​సైట్లను ఉపయోగిస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి సమస్య ఎప్పటికప్పుడు అధికారులకు తెలిసేలా ప్రజలను టెక్నాలజీ వైపు నడిపిస్తున్నారు. మొబైల్​ యాప్, ప్రత్యేక వెబ్​సైట్లను గ్రామ సర్పంచులు ఆవిష్కరించారు. కొదురుపాకలో ‘మన విలేజ్’​ పేరుతో ప్రత్యేక మొబైల్​ యాప్​ను ఏర్పాటు చేయగా, మల్లారం గ్రామంలో ‘మన ఊరు’ పేరుతో (https://www.mallaramgramapanchayat.com/en) ప్రత్యేక వెబ్​సైట్​ను ఏర్పాటు చేశారు. 

వీటి ద్వారా గ్రామాల్లోని సమస్యలను పాలకులకు తెలిసేలా ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేశారు. ఆ సమస్యను పాలకులు పరిష్కరించారా? లేదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ప్రజలకు అవకాశం కల్పించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. గ్రామాల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని వెబ్​సైట్, మొబైల్​ యాప్​లో పొందుపరుస్తూ పాలకులు గ్రామాల్లో చేసే పనులపై ప్రజలకు తెలియజేస్తున్నారు. సమస్యను ఫొటో ద్వారా యాప్​లో, వెబ్​సైట్​లో ఎన్​రోల్​ చేస్తే వెంటనే సంబంధిత సర్పంచ్, కార్యదర్శి, ఇతర అధికారులకు నోటిఫికేషన్​ వెళ్లేలా రూపొందించారు. 

అలాగే గ్రామాల సమగ్ర సమాచారాన్ని పొందుపర్చడంతో ప్రతి అంశాన్ని గ్రామస్తులు తెలుసుకునే అవకాశం ఉంది. గ్రామ జనాభా, విస్తీర్ణం, పాలకవర్గ సభ్యులు, అధికారుల సమాచారాన్ని, గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర సమాచారాన్ని పొందుపరిచారు. గ్రామాల్లో ప్రభుత్వం నుంచి పథకాలు పొందిన లబ్ధిదారుల వివరాలు పొందుపర్చడంతో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకతకు అవకాశం ఉంటుంది.

వెబ్​సైట్​ను ప్రారంభించిన ప్రభుత్వ విప్..​

ఆయా గ్రామాల ప్రత్యేక వెబ్​సైట్, మొబైల్​ యాప్​లను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. వేములవాడ రూరల్​ మండలం మల్లారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక వెబ్​సైట్​ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ ప్రారంభించగా, బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామ మొబైల్​ యాప్​ను కరీంనగర్​ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆవిష్కరించారు.