- వీటికి తోడు వైస్ చైర్మన్లు కూడా..
- చాంబర్ల కేటాయింపు ఎలా అని అధికారుల సతమతం
- జీఏడీ నిర్ణయం కోసం వెయిటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో మరికొన్ని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లను నియమించగా, ఇదిప్పుడు బీసీ సంక్షేమ శాఖాధికారులకు కొత్త తలనొప్పిగా మారింది. మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు చెందిన బీసీ కార్పొరేషన్, ఎంబీసీ, ట్రైకార్, ఎస్సీ కార్పొరేషన్, ముదిరాజ్ కార్పొరేషన్‌తో పాటు ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఉండగా, తాజాగా బీసీల నుంచి మరో తొమ్మిది మందిని సర్కారు నియమించింది. దీంతో వీరికి చాంబర్లను ఎక్కడ కేటాయించాలన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఒకరిద్దరికి మినహా మిగతా వారికి సరిపడా జాగ లేదని అధికారులంటున్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే సీఎస్ రామకృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లామని, వారి నుంచి ఏ నిర్ణయం వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫెడరేషన్లకు చైర్మన్లతో పాటు వైస్ చైర్మన్లను కూడా నియమించింది. అయితే, వీరికి చాంబర్ల కేటాయింపు ఉండదని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీసీ సంక్షేమశాఖాధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఉద్యోగులకే జాగ కరువు
సంక్షేమ భవన్‌లో ఉద్యోగులకే స్థలం సరిపోవడం లేదు. ఇటీవల టీఎస్ పీఎస్సీ ద్వారా అన్ని శాఖలకు పెద్ద సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్లు వచ్చారు. వీరికి స్థలం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆఫీసుల రికార్డులు, బీరువాలు అన్నీ కారిడార్లలో ఏర్పాటు చేశారు. బీసీ వెల్ఫేర్ శాఖకు బీసీ గురుకుల సొసైటీ ఆఫీసులను షిఫ్ట్ చేయాలని, ఇతర ప్రభుత్వ భవనాల్లో కేటాయించాలని రిక్వెస్ట్ పెట్టారు. దీనికోసం సెక్రటేరియెట్ దగ్గరున్న బీఆర్కే భవన్ ను సైతం పరిశీలించారు. అయితే అది ముందుకు సాగలేదు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకే జాగ లేక తిప్పలు పడుతుంటే కొత్త చైర్మన్లకు చాంబర్లు కేటాయించడం ఎలా అని అధికారులు కిందా మీద పడుతున్నారు. చాంబర్లు ఏర్పాటు చేస్తే కుదురుతుందా అంటే సరిపోదు. చైర్మన్‌ను కలవడానికి వచ్చే వారికి యాంటీ రూమ్, విజిటర్స్ వెయిటింగ్ రూమ్ అంటూ అదనంగా గదులను కేటాయించాల్సి ఉంటుంది. గతంలో నియామకమైన కార్పొరేషన్ల చైర్మన్లను కలిసేందుకు వచ్చిన వారే లిఫ్ట్ ల దగ్గర, కారిడార్లలో వెయిట్ చేస్తూ పని చేసుకుపోతున్నారు. ఇంకా కొత్తగా వచ్చే విజిటర్స్సంగతేంటో అని మదనపడుతున్నారు.
బీఆర్కే భవనా.. మరోచో టనా?
సంక్షేమ భవన్‌లోనే ఆఫీసులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో బీఆర్కే భవన్ లోనే చాంబర్లుకేటాయిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి జీతాలు, వాహనాలు, హెచ్ఆర్ఏ, సిబ్బంది కేటాయింపు, ఇతర ఖర్చులకు సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన వెంటనే చైర్మన్లు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. మరో రెండు వారాల్లో ఇదంతా పూర్తయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ఏం చేసుడా అని తండ్లాడుతున్నారు. త్వరగా బీఆర్కే భవన్లోనో.. లేక మరో చోట చాంబర్లు కేటాయించాలని కోరుకుంటున్నారు.
ఆ కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు
సర్కారు కొత్తగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్, భట్రాజ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్, రజక సహకార సంస్థ, గౌడ సహకార సంస్థ, పెరిక సహకార సంస్థ, మేరు సహకార సంస్థ, వాల్మీకి బోయ సహకార సంస్థ, మున్నూరు కాపు, యాదవ సహకార సంస్థ, వడ్డెర సహకార సంస్థలకు చైర్మన్లను, కొన్నింటికి వైస్ చైర్మన్లను నియమించింది.
