- రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- రాష్ట్రంలోని ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు
- గత ప్రభుత్వం భారీగా ప్రజాధనం ఖర్చుచేసినా తగిన ఆయకట్టును సృష్టించలే
- పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడమే సర్కారు లక్ష్యమని వెల్లడి
కోదాడ, వెలుగు: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని, సమర్థవంతమైన పోరాటం చేస్తున్నదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయబద్ధమైన జలవాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని తేల్చిచెప్పారు. సూర్యాపేట జిల్లాలోని ఆర్-9 ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నదీ జలాల ట్రిబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేఆర్‌ఎంబీతోపాటు ప్రతి వేదిక ముందు తెలంగాణ రైతుల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షిస్తామని , కృష్ణా, గోదావరి జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరిగేలా అన్ని బలమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు.
అవన్నీ నిరాధార ఆరోపణలు
నీటిపారుదల, జల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. అవన్నీ బీఆర్‌ఎస్ నాయకుల అసత్య, నిరాధార ప్రచారాలేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే సాగునీరు, వ్యవసాయ విద్యుత్ నిర్వహణ సమర్థవంతంగా జరిగిందనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని, వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. తమ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థలను, వ్యవసాయ విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీరుస్తున్నదని తెలిపారు.
అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టునూ రైతుల ప్రయోజనాలకు ఉపయోగించి, పంట పొలాలకు ఫలప్రదంగా చేరవేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో లక్షల కోట్లు ఖర్చుచేసినా.. కీలక ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిందని చెప్పారు. వ్యయానికి తగ్గట్టుగా సాగునీటి సామర్థ్యాన్ని, కొత్త ఆయకట్టును సృష్టించలేకపోయారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం, వాస్తవ ఆయకట్టును సృష్టించడం, నీరు, విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించడం, కృష్ణా– గోదావరి నదుల్లో తెలంగాణ జలహక్కులను పరిరక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు.
