- 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఊరట
- ఈ ఏడాది రాష్ట్ర ఖజానాకు రూ.33,181 కోట్లు..వచ్చే ఐదేండ్లలో రూ.2.27 లక్షల కోట్లు
- రాష్ట్రాలకు ఇచ్చే దాంట్లో 41 శాతమే కొనసాగింపు..వెయిటేజీల్లో మార్పులతోనే తెలంగాణకు మేలు
- కలిసొచ్చిన జీడీపీ కంట్రిబ్యూషన్, అటవీ విస్తీర్ణం,పర్యావరణ పరిరక్షణ, జనాభా నియంత్రణ చర్యలు
హైదరాబాద్, వెలుగు: పన్నుల వాటా విషయంలో రాష్ట్రాలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతూ పాత పద్ధతిలోనే 41 శాతం వాటాను కొనసాగించాలని 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు డిమాండ్ చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే వెయిటేజీకి సంబంధించి కొన్ని మార్పులు చేయడంతో తెలంగాణ వాటా కొద్దిగా పెరిగింది.
గతంలో ఉన్న 2.102 శాతాన్ని 2.174 శాతానికి 16వ ఫైనాన్స్కమిషన్పెంచింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం.. రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో రూ.33,181 కోట్లు రానున్నాయి. అంటే గతం కంటే దాదాపు రూ.4 వేల కోట్లు అదనంగా అందనున్నాయి. ఈ లెక్కన నెలకు సగటున రూ.2,370 కోట్ల చొప్పున రాష్ట్ర ఖజానాకు నిధులు వస్తాయి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కావడంతో పాటు అటవీ విస్తీర్ణం పెంచడం, జనాభాను నియంత్రణ చర్యల ఫలితంగా ఈ అదనపు వాటా దక్కింది.
మొత్తంగా వచ్చే ఐదేండ్లలో పన్నుల వాటా రూపంలో రానున్న రూ. 2.27 లక్షల కోట్లకు తోడు అదనంగా స్థానిక సంస్థలు, హెల్త్, విపత్తు నిధుల రూపంలో మరో రూ.30,315 కోట్లు తెలంగాణకు దక్కనున్నాయి. అంటే మొత్తమ్మీద కేంద్రం నుంచి అందే నిధుల వాటా రూ.2.57 లక్షల కోట్లు దాటనుంది. ఇది గతం కంటే సుమారు రూ.60 వేల కోట్లు ఎక్కువ.
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ఊరట..
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను శిక్షించకూడదన్న తెలంగాణ వాదనకు కొంత అంగీకరించిన కమిషన్.. దేశ జీడీపీలో రాష్ట్రం అందిస్తున్న గణనీయమైన సహకారాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. తెలంగాణ కోరిన విధంగా ఇన్‌కం డిస్టెన్స్వెయిటేజీని కొంత తగ్గించి, రాష్ట్రాల పనితీరుకు వెయిటేజీ ఇవ్వడం మనం సాధించిన అతిపెద్ద విజయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వెయిటేజీ గతంలో 45 శాతం ఉండగా, ఈసారి దాన్ని 42.5 శాతానికి ఫైనాన్స్ కమిషన్ తగ్గించింది.
ఇక జనాభా ప్రాతిపదికన (2011) 17.5 శాతం, అటవీ విస్తీర్ణం ఆధారంగా 10 శాతం వెయిటేజీ, దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ వాటా ఆధారంగా మరో 10 శాతం వెయిటేజీ ఇచ్చారు. అటవీ విస్తీర్ణం, జనాభా నియంత్రణ, దేశ జీడీపీలో రాష్ట్ర వాటా అంశాల ఆధారంగానే కేంద్ర పన్నుల్లో మన వాటా 2.174 శాతానికి పెరిగింది.
గతంతో పోలిస్తే 30% ఎక్కువ నిధులు..
గత 15వ ఆర్థిక సంఘం కేటాయింపులతో పోలిస్తే, 16వ ఆర్థిక సంఘం కాలంలో తెలంగాణకు అందే పన్నుల వాటా నిధులు భారీగా పెరిగాయి. గత ఐదేళ్లలో (2021-–26) తెలంగాణకు సుమారు రూ.1.75 లక్షల కోట్లు పన్నుల వాటాగా అందగా, వచ్చే ఐదేళ్లలో (2026–31) ఇది ఏకంగా రూ.2.27 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే గతం కంటే సుమారు రూ.52 వేల కోట్ల అదనపు రాబడి తెలంగాణ ఖజానాకు చేరనుంది. ఇది దాదాపు 30 శాతం వృద్ధిని సూచిస్తోంది.
రాష్ట్రం సాధిస్తున్న జీఎస్‌డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం, పారిశ్రామిక, సేవా రంగాల్లో దూసుకుపోతుండటాన్ని కమిషన్ సానుకూలంగా పరిగణించింది. వచ్చే ఐదేళ్ల కాలంలో తెలంగాణకు అందే పన్నుల వాటా నిధులు ఏటా ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ వస్తాయి.
వచ్చే ఐదేండ్లలో రాష్ట్రానికి దక్కనున్న పన్నుల వాటా అంచనా ఇదీ(రూ.కోట్లలో)
ఆర్థిక సంవత్సరం నిధులు
2026-27 33,181
2027-28 40,023
2028-29 44,828
2029-30 50,219
2030-31 56,263
