- జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన
- 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే చాన్స్
- పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- మధ్యాహ్నం 12 నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే మూడు రోజులు మరింత మండుటెండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం రాష్ట్రంలో గరిష్టంగా 37.4 డిగ్రీలు, కనిష్టంగా 25.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సమారుగా 42 నుంచి 45 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ అడ్వైజరీని విడుదల చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ ప్రజలకు సూచించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎండలో నడవాల్సి వస్తే గొడుగు వాడటం, తలకు టోపీ, టవల్ చుట్టుకోవాలని, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమమని తెలిపారు.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు (శుక్రవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. శనివారం ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణలోని మరిన్ని జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయి. ఇక ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 జిల్లాల్లో ఎండలు దంచి కొడతాయని వాతవారణ శాఖ హెచ్చరించింది. తూర్పు తెలంగాణ జిల్లాలు మినహా దాదాపు రాష్ట్రమంతా ఆరెంజ్ అలెర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాల్లో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ లక్షణాలుంటే.. హాస్పిటల్కు వెళ్లాల్సిందే..
తీవ్రమైన తలనొప్పి, వాంతులు, అలసట, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లేనని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు. బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, మందులను సిద్ధంగా ఉంచామని, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, బస్తీ, పల్లె దవాఖానల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
ఇవి చేయండి...
- దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి.
- బయటకు వెళ్లేటప్పుడు వెంట వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.
- ఓఆర్‌ఎస్ కలిపిన నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
- పుచ్చకాయ, కర్బూజా, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి.
- ఇంట్లో కిటికీలకు పరదాలు తీసి ఉంచాలి. గాలి తగిలేలా చూసుకోవాలి.
నీడలో ఉన్నా జాగ్రత్తలు తప్పనిసరి..
ఎండలో తిరిగేవారే కాకుండా, ఇంట్లో ఉండేవారూ జాగ్రత్తలు పాటించాల్సిందే. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఉక్కపోతతో చెమటలు వచ్చి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధులు నీడలో ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకోవడం విస్మరించొద్దు. మధ్యాహ్నం టైంలో పిల్లలు, డయాబెటిక్ రోగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లొద్దు. ఆకుకూరలు, తాజా కూరగాయల వంటలు తినాలి. జ్యూస్తాగడం, పండ్లు తినడం మంచిది. కూల్ డ్రింక్స్ తాగొద్దు. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలి. నీరసం, వాంతులు, తల తిరగడం వంటి హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలి.
- డాక్టర్ రాజారావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ
ఇవి చేయకండి...
- మధ్యాహ్నం పూట కష్టమైన పనులు చేయకూడదు.
- ఖాళీ కడుపుతో, చెప్పులు లేకుండా ఎండలోకి వెళ్లొద్దు.
- ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది.. వాటికి దూరంగా ఉండాలి.
- ఎక్కువ ప్రోటీన్ ఉండే మాంసాహారం, మసాలా దినుసులు, నూనెలో వేయించిన పదార్థాలు తినొద్దు.
