V6 News

జగిత్యాల @ 44.4.. రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. పది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు

జగిత్యాల @  44.4.. రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. పది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు
  • మరో 9 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా రికార్డు
  • హైదరాబాద్‌‌లోని అన్ని సర్కిళ్లలో 
  • 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
  • 19 నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. టెంపరేచర్లు 45 డిగ్రీల మార్క్‌‌కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో 43 డిగ్రీలకంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 

ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, మంచిర్యాల జిల్లా జన్నారం, నల్గొండ జిల్లా ముదిగొండ, నిర్మల్ జిల్లా ముజిగి, నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌‌లలో 44.3 చొప్పున, కామారెడ్డి జిల్లా బిర్కూరు, కరీంనగర్ జిల్లా ఏదులగట్టెపల్లి, సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, నాగర్​కర్నూలు, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 

మరోవైపు, హైదరాబాద్ సిటీలోనూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకుపైగానే రికార్డయ్యాయి. రామచంద్రాపురంలో 42.3 డిగ్రీలు, అంబర్‌‌‌‌పేట, మెహిదీపట్నంలో 42 డిగ్రీల చొప్పున, మలక్‌‌పేట, బేగంపేటలో 41.9 చొప్పున, సరూర్‌‌‌‌​నగర్, గోషామహల్, చందానగర్‌‌‌‌లలో 41.8 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో రికార్డ్​ స్థాయిలో 41 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. 

  • 19 నుంచి వర్షాలు..

ప్రస్తుతం ఎండలు దంచుతున్నా.. రెండ్రోజుల తర్వాత నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతారణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు పడ్తాయని చెప్పింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం ఎండల తీవ్రత అలాగే ఉంటుందని, సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. వడగండ్లు పడ్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.