తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. జీవో 317 బాధిత టీచర్లకు తాత్కాలిక డిప్యూటేషన్లు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. జీవో 317 బాధిత టీచర్లకు తాత్కాలిక డిప్యూటేషన్లు

హైదరాబాద్, వెలుగు: జీవో 317 బాధిత టీచర్లకు తాత్కాలిక డిప్యూటేషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. దీంతో అర్హులైన టీచర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లతో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఈ నెల 17 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. అర్హులైన వాళ్లు schooledu.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఈ దరఖాస్తు కాపీని సంబంధిత ఆర్‌‌‌‌‌‌‌‌జేడీ లేదా డీఈఓలకు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రేషనలైజేషన్, ఖాళీల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారి డేటాను సర్కారుకు పంపించాలని డీఈఓలను ఆదేశించారు. దరఖాస్తుల్లో ఏమైనా సాంకేతిక సమస్యలుంటే 8523030307 నంబర్‌‌‌‌ను సంప్రదించాలని సూచించారు. అయితే, ప్రస్తుతం జిల్లాలు, మల్టీజోన్లలో వెకెన్సీలు, సీనియార్టీ ప్రకారం డిప్యూటేషన్ ఇవ్వనున్నారు. ముందుగా రెండేండ్ల పాటు అవకాశం ఇవ్వనుండగా, ఆ తర్వాత మరో ఏడాది దాన్ని పొడిగించే అవకాశం ఉంది. 

ఆ తర్వాత వారికి పొడిగించే చాన్స్ ఉండదు. మిగిలిన వారికి మరోసారి ఇదే పద్ధతిలో అవకాశం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో జీవో 317 ప్రకారం సుమారు 24,500 మంది టీచర్లకు స్థాన చలనం జరిగింది. దీంట్లో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, సీనియార్టీ కేటగిరీలో సుమారు 15 వేల మంది సొంత జిల్లాలకు చేరారు. మరో పది వేల మందికి అర్హత ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇందులో సుమారు 7 వేల నుంచి 8 వేల మంది అప్లై చేసుకునే చాన్స్‌‌‌‌ ఉందని అంచనా వేస్తున్నారు.