యాసంగి ధాన్యం విక్రయాలకు టెండర్లు ఖరారు!

యాసంగి ధాన్యం విక్రయాలకు టెండర్లు ఖరారు!

హైదరాబాద్‌, వెలుగు: నిరుడు యాసంగిలో సేకరించిన 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయాలకు టెండర్లను సివిల్‌ సప్లయ్స్‌ శాఖ కన్ఫామ్‌ చేసినట్లు సమాచారం. హయ్యెస్ట్ కోట్ చేసిన బిడ్డర్లకు టెండర్లు ఖరారయ్యాయని, వారికి ఈ మెయిల్‌ ద్వారా సమాచారం పంపించినట్లు తెలిసింది. ఇందులో 3 లక్షల టన్నుల చొప్పున 11 లాట్లుగా, 1.59 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని ఒక లాట్‌గా విభజించి మొత్తం12 లాట్లకు గత జనవరి 25న నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఈ టెండర్‌‌లో మొత్తం ఏడు కంపెనీలు పాల్గొని 12 లాట్లకు 30 బిడ్లు దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ హాకాకు ఈ రంగంలో అర్హత లేని కారణంగా టెండర్లు రిజెక్ట్ అయ్యాయి. దీంతో మిగతా 6 కంపెనీలకు చెందిన 26 బిడ్లు మాత్రమే పోటీలో నిలిచాయి. సాధారణ ధాన్యానికి సగటున రూ.1,950.. సన్న రకం ధాన్యానికి రూ.2,150 వరకు ధర కోట్ చేసినట్టు తెలిసింది. రైతుల నుంచి సివిల్‌ సప్లయ్స్‌ డిపార్ట్‌మెంట్‌ క్వింటాలుకు రూ.2,040-, రూ.2,060 మద్దతు ధరతో వడ్లు కొనుగోలు చేసింది. ఇతర ఖర్చులు కలిపితే క్వింటాలుకు రూ.2,300 వరకు అయిందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా టెండర్లలో ఎంత కోట్ చేశారనేది బయటకు రాలేదు. ఇది తెలిస్తే కానీ సంస్థకు ఎంత నష్టం వాటిల్లనుందనేది తేలనుంది.