శాతవాహనలో ఆన్సర్ షీట్ల స్కానింగ్​కు టెండర్లు‌

శాతవాహనలో ఆన్సర్ షీట్ల స్కానింగ్​కు టెండర్లు‌
  • నోటిఫికేషన్ జారీ చేసిన యూనివర్సిటీ రిజిస్ట్రార్
  •     వచ్చే నెల 6లోపు బిడ్ దాఖలుకు గడువు
  •     ఏటా10లక్షల స్క్రిప్టులు స్కాన్ చేయాలని వెల్లడి

కరీంనగర్, వెలుగు : శాతవాహన యూనివర్సిటీ అధికారులు ఎట్టకేలకు ఆన్సర్ షీట్ల స్కానింగ్ కు టెండర్ల నోటిఫికేషన్ జారీ చేశారు. మూడేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే రూ.కోటిన్నర విలువైన పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంపై ‘టెండర్ లేకుండానే ఆన్సర్ షీట్ల స్కానింగ్ వర్క్స్’ హెడ్డింగ్​తో ఈ నెల 3న ‘వీ6 వెలుగు’లో స్టోరీ పబ్లిష్ అయింది. దాంతో ఈ వ్యవహారం ఉన్నత విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆన్సర్ షీట్ల స్కానింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిసింది. బుధవారం ప్రారంభమైన బిడ్ దాఖలు ప్రక్రియ వచ్చే నెల 6న ముగియనుంది. సెమిస్టర్ కు సుమారు 5 లక్షల స్ట్ర్కిప్టుల చొప్పున ఏటా 10 లక్షల స్క్రిప్టులను స్కానింగ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఇందులో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఓరియంటల్ లాంగ్వేజెస్ చదివే డిగ్రీ స్టూడెంట్లవి 8.50 లక్షలు, పీజీ కోర్సులవి 50 వేలు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులవి 40 వేలు, బీఈడీ, బీపీఈడీ, ఎంఈడీ కోర్సులవి 35 వేలు, ఎల్ఎల్ బీ 12 వేలు, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులవి 5 వేల స్క్రిప్టులు ఉంటాయని వివరించారు. 

మూడేండ్లుగా ఒకే సంస్థకు..

రూ.5 లక్షలకు మించి ఏ పనులకైనా టెండర్ పిలవాల్సి ఉండగా.. సుమారు కోటిన్నర పైగా విలువైన ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులను గత మూడేళ్లుగా నామినేషన్ పద్ధతిలో ఓ సంస్థకు వర్సిటీ అధికారులు అప్పగిస్తూ వచ్చారు. తొలుత ఒక స్క్రిప్టు స్కానింగ్ చేయడానికి రూ.12గా అగ్రిమెంట్ చేసుకోగా.. ఆ తర్వాత సంవత్సరానికే సుమారు 80 శాతం మేర రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ఎలాంటి టెండర్ లేకుండా నిర్వహించిన మూడేళ్ల లావాదేవీలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్​చేస్తున్నారు.