ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న మహిళా అథ్లెట్‌గా జపాన్‌కు చెందిన టెన్నిస్ నవోమీ ఒసాకా నిలింది. గత పన్నెండు నెలల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించిన జాబితాలో రూ.284.20 కోట్లతో అమెరికా దిగ్గజం, నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ను వెనక్కి నెట్టి ఒసాకా మొదటి స్థానంలో నిలిచింది. ఏడాదిలో ఒసాక ప్రైజ్‌మనీ, ఎండార్స్ మెంట్ల రూపంలో సెరెనా కన్నా రూ. 10.64 కోట్లు అధికంగా సంపాదించింది. దీంతో గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తున్న సెరెనా విలియమ్స్ రెండో స్థానానికి పడిపోయింది. 22 ఏళ్ల నవోమీ ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించింది. ఇప్పటివరకు రష్యా మాజీ ప్లేయర్ మరియా షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె బ్రేక్ చేసింది. ఇక ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది అథ్లెట్లతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది.

