భూదాన్ భూముల్లో  గుడిసెలు కూల్చివేత..ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో తీవ్ర ఉద్రిక్తత

భూదాన్ భూముల్లో  గుడిసెలు కూల్చివేత..ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో తీవ్ర ఉద్రిక్తత
  • వందలాది మంది అధికారులు, పోలీసులతో వినోభా కాలనీ దిగ్బంధం
  • బుల్డోజర్లతో 600 ఆక్రమణల తొలగింపు
  • ముల్లె మూట, పిల్లపాపలతో వెళ్లిపోయిన పేదలు
  • పట్టాలిప్పిస్తామని పైసలు తీసుకొని పత్తా లేకుండా పోయిన నాయకులు

ఖమ్మం టౌన్, వెలుగు:  ఖమ్మం అర్బన్  మండలం వెలుగుమట్లలోని భూదాన్  భూముల్లో గుడిసెల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. పన్నెండేళ్ల నుంచి పక్కా ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న పేదల ఇండ్లను మంగళవారం రెవెన్యూ అధికారులు పోలీస్  సిబ్బందితో కలిసి ఖాళీ చేయించారు. జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు.

ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న వారికి, అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో పాటు జేసీబీలకు స్థానికులు అడ్డుపడడంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు చెబుతుండగా, తమకు ఇండ్ల పట్టాలివ్వాల్సిన అధికారులు, కొంత మంది పెద్దలకు ఈ భూములను కేటాయించేందుకు తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

కాలనీని దిగ్బంధం చేసి..

సోమవారం రాత్రి నుంచే వినోభా నగర్  కాలనీ వద్దకు రెవెన్యూ, మున్సిపల్  కార్పొరేషన్, రవాణా, అటవీ శాఖ, రెవెన్యూ యంత్రాంగం వందలాదిగా వచ్చి దిగ్బంధం చేశారు. పక్కా ఇండ్లు కూల్చేందుకు జేసీబీలు, క్రేన్లు, సామాన్లు తరలించేందుకు కార్పొరేషన్ కు చెందిన వాహనాలతో పాటు ప్రైవేట్  వాహనాలు సిద్ధం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి సుమారు 600 మంది పోలీస్  బలగాలను రప్పించి మోహరించారు. మీడియా కవరేజీకి అంగీకరించలేదు.

ఇండ్ల కూల్చివేత సమయంలో ఇంటి యజమాని లేకుంటే, ఆ ఇంటిని వీడియో రికార్డ్  చేసుకొని, సామాన్లకు ఆర్డీవో, తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేసి పునరావాస షెల్టర్ కు తరలించారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో 147, 148, 149 సర్వే నంబర్లలో 31.07 ఎకరాల భూదాన్  భూమి ఉంది.

దీనిలోని 149 సర్వే నంబర్ లో ఆచార్య వినోభా భావే పేరుతో ఉండి, 1954 సంవత్సరం నుంచి రెవెన్యూ రికార్డ్  మేరకు కాస్రా పహాణీలో ఉన్న 27.7 ఎకరాల భూమిలో పలు ప్రాంతాల నుంచి వలస వచ్చిన సుమారు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. 2014లో భూదాన్  ట్రస్ట్  బోర్డ్  ఆదేశాల మేరకు 100 గజాల చొప్పున భూమిని పంచుకొని గుడిసెలు వేసుకుని ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. 

పేదల మాటున పెద్దల దందా..!

భూదాన్  భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రజలకు భూదాన్  ట్రస్ట్  బోర్డ్  పట్టాలు ఇవ్వనున్నట్లు అక్కడి కొందరు నాయకులు ఆశలు కల్పించారు. పక్కా ఇండ్లు నిర్మించుకున్న వారికే స్థలం దక్కుతుందని నమ్మించడంతో, ఆర్థిక స్థోమత లేకపోయినా సొంత గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూమిని అమ్ముకుని కొందరు, ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్ముతో మరికొందరు, ఆడవాళ్ల మెడలో ఉన్న బంగారాన్ని అమ్మి, కుదువపెట్టి ఇంకొందరు ఇండ్లను నిర్మించుకున్నారు.

అక్కడి ఇండ్లకు విద్యుత్, తాగునీటి సౌకర్యం లేకపోయినా నాయకుల మాటలు నమ్మి నట్టేట మునిగారు. విలువైన భూమి చేజిక్కించుకోవాలంటే న్యాయస్థానంలో పోరాటానికి డబ్బులు అవసరమవుతాయని ఒక్కో ఇంటి యజమాని నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అన్ని విధాలా అక్కడి నిరుపేద ప్రజల్లో ఆశలు కల్పించిన నాయకులు చివరకు పత్తా లేకుండా పోయారు.

ఒకే స్థలాన్ని పలువురు పేరిట మార్చుతూ, రూ.లక్షల్లో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీరా అధికార యంత్రాంగం ఇండ్లు కూల్చే సమయానికి, అండగా ఉంటామని చెప్పిన నాయకులు కనిపించక పోవడంతో ఆత్మస్థైర్యం కోల్పోయి నిస్సహాయ స్థితిలో కనిపించారు. ముల్లె, మూట సర్దుకుని వాహనాల్లో నిర్వాసితులు సామాన్లను తీసుకెళ్తూ కనిపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి.

బోర్డు ఆదేశాల మేరకే.. అడిషనల్  కలెక్టర్  శ్రీనివాస్​రెడ్డి

తెలంగాణ భూదాన్  యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకే వెలుగుమట్ల భూములు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్  కలెక్టర్  పి.శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. అడిషనల్  డీసీపీ ప్రసాద్​రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 1953 లో కలవల రాజా రామారావు 31 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్  ఉద్యమంలో దానం చేశారని తెలిపారు. ఈ భూమి ఆక్రమణకు గురి కాగా, తహసీల్దార్  2019లో నోటీసులు జారీ చేశారని చెప్పారు. నోటీసులపై కొందరు హైకోర్టుకు వెళ్లారని తెలిపారు. పిటిషనర్ల నిర్మాణాలను తొలగించవద్దని కోర్టు ఆదేశించిందన్నారు.

 ఆ తర్వాత తెలంగాణ భూదాన్  యజ్ఞ బోర్డు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిందని చెప్పారు. కేజీబీవీ, మోడల్  స్కూల్  కోసం ఐదెకరాల చొప్పున 10 ఎకరాలు మాత్రమే కేటాయించినట్లు తేలిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ల ఇండ్లు మినహా మిగిలిన వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పేదల ఇంటి నిర్మాణాలు కూల్చివేస్తున్నారని సోషల్​ మీడియాలో ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. నిరాశ్రయులైన వారికి కమ్మవారి సంఘంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామని తెలిపారు.