డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్​పై టెన్షన్

డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్​పై టెన్షన్

రెండ్రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న ఓయూ

తమిళనాడు మాదిరిగా ప్రమోట్ చేయాలంటున్న స్టూడెంట్స్​

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్​తో వాయిదా పడ్డ డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్​పై టెన్షన్ నెలకొంది. ఈ నెల 30లోగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించడంతో ఓయూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎగ్జామ్స్​ షెడ్యూల్​పై రెండ్రోజుల్లో ఓయూ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్​పెట్టి, బ్యాక్ లాగ్స్ లేని స్టూడెంట్ల రిజల్ట్స్ ప్రకటించి, తర్వాత బ్యాక్ లాగ్స్ కి ఎగ్జామ్స్​ కండక్ట్​ చేయాలని భావిస్తున్నారు. రెండ్రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తామని ఎగ్జామ్స్​ కంట్రోలర్​ శ్రీరామ్ వెంకటేశ్​ తెలిపారు. కాగా, ఫైనల్ సెమిస్టర్ క్లియర్ అయినా, బ్యాక్ లాగ్స్ ఉండిపోతే సర్టిఫికెట్లు పొందే వీలుండదని స్టూడెంట్లు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో 3 లక్షల మంది ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్​రాయాల్సి ఉంది. ఓయూ పరిధిలోనే 1.10 లక్షల మంది డిగ్రీ, పీజీ స్టూడెంట్లు ఫైనల్ సెమిస్టర్స్​ రాయనున్నారు. ఓయూ పరిధిలో 62 శాతం మంది పీజీ స్టూడెంట్లకు, మిగతా వర్సిటీల్లో ఇంచుమించుగా 65 శాతం మందికి బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో 68 శాతం మందికి బ్యాక్ లాగ్స్ ఉన్నట్లు చెప్తున్నారు. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ తోపాటు బ్యాక్ లాగ్ ఎగ్జామ్స్​నిర్వహిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్​ పెట్టకుండానే ప్రమోట్ చేయాలని స్టూడెంట్స్​డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేలా.. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఎగ్జామ్స్​లేకుండానే కనీస మార్కులతో ప్రమోట్ చేశారని, ఇక్కడా అలాగే చేయాలని కోరుతున్నారు.