ఢిల్లీ సరిహద్దుల్లో..అదే టెన్షన్

ఢిల్లీ సరిహద్దుల్లో..అదే టెన్షన్
  •     బారికేడ్లు తొలగించే ప్రయత్నం
  •     టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు.. 
  •     సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్​నెట్ సేవలు నిలిపివేత

చండీగఢ్/న్యూఢిల్లీ : ఢిల్లీ బార్డర్​లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పంజాబ్ - హర్యానా సరిహద్దులో వేలాది మంది రైతులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. శంభు బార్డర్ నుంచి ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడంతో పాటు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ బుధవారం రెండో రోజుకు చేరుకుంది. హర్యానా జింద్ జిల్లాలోని సింఘ్​వాలా – ఖనౌరి బార్డర్​లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రాక్టర్లతో సిటీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల కంచెలు, షిప్పింగ్ కంటైనర్లను తొలగించేందుకు ప్రయత్నించారు. శంభు బార్డర్ వద్ద గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నేషనల్ హైవేకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రక్కులు పార్క్ చేశారు. అయితే, ఢిల్లీ పోలీసులు తమ భూభాగంలోకి వచ్చి డ్రోన్లతో టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని పంజాబ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోషల్ మీడియా సేవలు నిలిపివేత

సరిహద్దుల్లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీతో పాటు హర్యానా బార్డర్ పాయింట్ల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో పోలీసులు డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైతులు నిరసన తెలిపే ఏరియాల్లో ఇంటర్ నెట్ సేవలు అధికారులు నిలిపివేశారు. బల్క్ ఎస్ఎంఎస్​లు, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. బారికేడ్లు తొలగించేందుకు జేసీబీ తీసుకురావడంతోనే టియర్ గ్యాస్ ప్రయోగించామని తెలిపారు. ఏడు లేయర్స్​లో బారికేడ్లు, కాంక్రీట్ బ్లాక్స్, కంటైనర్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశామన్నారు.

సరిహద్దులు క్లోజ్ చేయడంతో ఇబ్బందులు

ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, సోనిపట్​ను కలిపే సింఘు బార్డర్ వద్ద పోలీసులు రోడ్లను తవ్వేశారు. దీంతో కాలినడకన సరిహద్దులు దాటాల్సి వస్తోంది. పంజాబ్, హర్యానా, యూపీ ప్రయాణికులు సింఘు బార్డర్ దాకా వచ్చి.. ఆ తర్వాత వేరే వెహికల్​లో ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోంది. 

రైతులకు మోదీ క్షమాపణ చెప్పాలి :  కాంగ్రెస్

స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు సాధ్యం కాదనడం ఏంటని ప్రశ్నించింది. 2014 మేనిఫెస్టోలో ఎంఎస్పీ చట్టబద్ధ హామీ ఉందని తెలిపింది. రైతులను టెర్రరిస్టులు, ఫారిన్ ఏజెంట్లు అనడం సరికాదని మండిపడింది. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

రైతులతో రాజ్​నాథ్ సింగ్, అర్జున్ ముండా భేటీ

రైతులతో కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, అర్జున్ ముండా బుధవారం సాయంత్రం ఢిల్లీలో చర్చలు జరిపారు. తమ డిమాండ్లను రైతు సంఘాల నేతలు మంత్రుల ముందుంచారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారన్నారు. బార్డర్ ఖాళీ చేసి తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర మంత్రులు సూచించగా.. దానికి రైతులు నిరాకరించినట్టు సమాచారం. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. 

పతంగులతో డ్రోన్లు కూల్చుతున్న రైతులు

టియర్ గ్యాస్ ప్రభావం తగ్గించేందుకు రైతులు నీళ్ల ట్యాంకులను సిద్ధం చేసుకున్నారు. అస్వస్థతకు గురి కాకుండా ఉండేందుకు బాటిళ్లలో నీళ్లు నింపుకుని, కండ్లద్దాలు పెట్టుకుని, తడిబట్టలతో రైతులు సిద్ధంగా ఉన్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు డ్రోన్లు ఉపయోగిస్తుంటే.. ఆ డ్రోన్లు కూల్చేందుకు రైతులు పతంగులు ఎగరేస్తున్నరు.  దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టియర్ గ్యాస్ కారణంగా శ్వాస సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, కండ్లు మండుతున్నాయని వివరించారు. వెంటనే తమ డిమాండ్లనునెరవేర్చా లని కోరారు. తాము కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.