హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తత.. స్టూడెంట్స్ యూనియన్ను డిజాల్వ్ చేయడంపై విద్యార్థి సంఘాల ఆందోళన

హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తత.. స్టూడెంట్స్ యూనియన్ను డిజాల్వ్ చేయడంపై విద్యార్థి సంఘాల ఆందోళన
  • హెచ్​సీయూ అడ్మినిస్ట్రేషన్​కు వ్యతిరేకంగా నినాదాలు
  • రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • లేదంటే నిరవధిక దీక్షకు దిగుతామని హెచ్చరిక

గచ్చిబౌలి, వెలుగు: పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికైన స్టూడెంట్స్ యూనియన్​ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్​సీయూ అడ్మినిస్ట్రేషన్​పై విద్యార్థి సంఘాల లీడర్లు మండిపడ్డారు. బుధవారం (సెప్టెంబర్ 10) వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు 12 విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఆందోళన చేపట్టారు. 

పదవీ కాలం ముగియక ముందే వర్సిటీ స్టూడెంట్ యూనియన్​ను​రద్దు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, లింగ్డో కమిటీ సిఫార్సులను ఉల్లంఘించడమేనన్నారు. ఇటీవల హెచ్​సీయూ విద్యార్థి సంక్షేమ డీన్​తో జరిగిన​సమావేశంలో ఏబీవీపీ తప్ప మిగిలిన సంఘాలు.. యూనియన్​కు పదవీ కాలం పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని తీర్మానించాయన్నారు. 

అయినప్పటికీ అడ్మినిస్ట్రేషన్ ఏబీవీపీకి అనుకూలంగా, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ చర్య విద్యార్థుల స్వయం ప్రతిపత్తిపై దాడిగా అభివర్ణించారు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడుతామని ప్రకటించారు.