ఈ నెలాఖరులోగా స్టేషన్ ఆవరణలో బుకింగ్ కార్యాలయం

ఈ నెలాఖరులోగా స్టేషన్ ఆవరణలో బుకింగ్ కార్యాలయం

సికింద్రాబాద్, వెలుగు:. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్దేశించిన రైల్వే స్టేషన్ల అప్‌‌గ్రేడేషన్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.స్టేషన్ ఆవరణలో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, ఆర్పీఎఫ్ భవనానికి సంబంధించిన ప్రధాన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫాల్స్ సీలింగ్ పనులు కొనసాగుతున్నాయి. తాత్కాలిక బుకింగ్ కార్యాలయాన్ని ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి తెస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆర్పీఎఫ్​ భవనానికి సంబంధించి ఇప్పటికే బేస్ మెంట్, స్తంభాల నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తి కాగా.. స్లాబ్, పార్టిషన్‌‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో కొత్త భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వీటితోపాటు 11 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల అండర్ గ్రౌండ్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 9.5 లక్షల లీటర్ల ట్యాంకులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు మిగతా పనులు వేగంగా జరుగుతున్నాయి

అప్ గ్రేడ్ పనులపై జీఎం సమీక్ష

సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని వివిధ స్టేషన్ల అప్ గ్రేడ్ పనులపై జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం రైల్ నిలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని మెయిన్ స్టేషన్లలో లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల పనితీరు గురించి తెలుసుకున్నారు. వాటి పనితీరును రియల్ టైమ్ లో పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 16 కోచ్ లతో నడపనున్న సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలు నిర్వహణ, సౌకర్యాలపై ఆయన సమీక్ష చేపట్టారు. సికింద్రాబాద్, నెల్లూరు, తిరుపతి స్టేషన్ల అప్‌‌గ్రేడేషన్ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్ టైమ్ లోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. విజయవాడ, గుంతకల్‌‌, గుంటూరు, సికింద్రాబాద్‌‌, హైదరాబాద్‌‌, నాందేడ్‌‌ డివిజన్ల రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్‌‌లో  పాల్గొన్నారు.