తెల్లారితే ఎగ్జామ్.. టెన్త్  స్టూడెంట్  సూసైడ్

తెల్లారితే ఎగ్జామ్.. టెన్త్  స్టూడెంట్  సూసైడ్
  • స్కూల్ యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపణ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తెల్లారితే టెన్త్  ఎగ్జామ్  రాయాల్సిన స్టూడెంట్ సూసైడ్  చేసుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీ చైతన్య స్కూల్​లో అప్పం నితీశ్(14) టెన్త్  చదువున్నాడు. తండ్రి లేకపోవడంతో కొడుకు చదువు కోసం తల్లి మౌనిక టేకులపల్లి మండలం కోయగూడెం నుంచి కొత్తగూడెం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని టైలరింగ్  చేసుకుంటూ జీవిస్తోంది.

ఫీజులు ఎక్కువైనప్పటికీ కొడుకుని ఉన్నతంగా చూడాలని ప్రైవేట్  స్కూల్​లో చదివిస్తోంది. ఈక్రమంలో రెండు నెలల కింద స్కూల్​లో స్టూడెంట్స్ మధ్య గొడవ జరగగా, నితీశ్​ను స్కూల్  యాజమాన్యం మందలించి కొత్తగూడెంలోని మరో బ్రాంచ్​కు పంపించింది. దీనిని అవమానకరంగా భావించిన నితీశ్​ పలుమార్లు తనను తిరిగి లక్ష్మీదేవిపల్లి స్కూల్​కు పంపించాలని వేడుకున్నాడు.

అందుకు ఒప్పుకోకపోగా అవమానించేలా స్కూల్​ యాజమాన్యం మాట్లాడింది. ఈక్రమంలో శుక్రవారం హాల్  టికెట్  కోసం వెళ్లిన నితీశ్​ను గొడవలు చేస్తావు.. చదవవు.. ఫీజు కూడా కట్టలేదు.. హాల్  టికెట్  ఎందుకు ఇవ్వాలంటూ యాజమాన్యం మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్టూడెంట్స్  చెబుతున్నారు. ఈ విషయమై లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హాల్  టికెట్  విషయం, యాజమాన్యం వేధింపులు వంటివి కంప్లైంట్ లో పేర్కొనలేదని పోలీసులు చెప్పారు. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని తెలిపారు. నితీశ్​ను వేధించలేదని, హాల్  టికెట్  కూడా తీసుకున్నాడని విద్యాసంస్థల ఏజీఎం జయప్రకాశ్ తెలిపారు.