సైబర్ నేరస్తులకు బ్యాంకు ఖాతాలు .. అమ్ముతున్న ముగ్గురు అరెస్టు

సైబర్ నేరస్తులకు బ్యాంకు ఖాతాలు .. అమ్ముతున్న ముగ్గురు అరెస్టు
  • ఆన్​లైన్​లో కొల్లగొట్టిన డబ్బును క్రిప్టోగా మార్చి పంపుతున్న నిందితులు
  • ఇటీవలే రూ.3.24 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
  • మోసగాళ్లు పంపిన లింక్​ను క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వ్యాపారి

హైదరాబాద్, వెలుగు: సైబర్  నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అమ్ముతున్న ముగ్గురిని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు శనివారం అరెస్టు చేశారు. విదేశాల్లో ఉండి ట్రేడ్‌‌  ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌‌  ముఠాలకు నిందితులు మన దేశం  నుంచి క్రిప్టో రూపంలో డబ్బులు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నిందితుల్లో హైదరాబాద్‌‌  సంతోష్‌‌ నగర్‌‌కు చెందిన ఎండీ రజీయుద్దీన్‌‌, మహబూబ్‌‌నగర్‌‌కు చెందిన మహ్మద్‌‌  జుబేర్‌‌ ఖాన్‌‌, బిహార్‌‌కు చెందిన ఎండీ వల్లుల్లాహ్‌‌  ఉన్నారు. ఇటీవలే నిందితులు హైదరాబాద్ కు చెందిన వ్యాపారి నుంచి ట్రేడింగ్‌‌లో పెట్టుబడుల పేరిట రూ.3.24 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసులో ఆ  ముగ్గురిని అరెస్టు చేశామని టీజీ సీఎస్‌‌బీ డైరెక్టర్‌‌  శిఖా గోయల్‌‌  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

గాంధీ నగర్ కు చెందిన వ్యాపారి శీతల్  గన్వాల్ కు మే 28న వాట్సాప్‌‌ లో బజాజ్  ఫైనాన్సియల్  సెక్యూరిటీ లిమిటెడ్  పేరుతో ఓ లింక్‌‌  వచ్చింది. ట్రేడింగ్‌‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని పలు దఫాలుగా అతడి నుంచి సైబర్‌‌  నేరగాళ్లు రూ.3.24 కోట్లు కొల్లగొట్టారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఈ నెల 11న టీజీసీఎస్‌‌బీలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన టీజీసీఎస్‌‌బీ అధికారులు కేసు దర్యాప్తు చేశారు. బాధితుడు డబ్బులు పంపిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. 

వల్లుల్లాహ్  అనే వ్యక్తి ఖాతాల్లోకి ఈ డబ్బులు మళ్లించినట్టు గుర్తించారు. అందులోంచి రూ.7,50,000 రజీయుద్దీన్‌‌  అనే వ్యక్తి విత్‌‌డ్రా చేసినట్టు ఆధారాలు లభించాయి. విత్‌‌డ్రా చేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాల్లోని సైబర్‌‌ ముఠా కింగ్‌‌పిన్‌‌కు పంపుతున్నట్టు గుర్తించారు. ఈ మొత్తం సైబర్‌‌ ముఠాలో కీలక నిందితులు విదేశాల్లో ఉంటూ ఇక్కడ తమ ఏజెంట్లను నియమించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. బీటెక్‌‌  పూర్తి చేసిన రజీయుద్దీన్‌‌కు ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.1.5 లక్షల కమీషన్‌‌  ఇస్తామని ఆశపెట్టడంతో అతడు తన స్నేహితులైన వల్లుల్లాహ్‌‌, జుబేర్‌‌ను ఒప్పించి కరెంట్‌‌  అకౌంట్‌‌తోపాటు మరో ఐదు బ్యాంకు ఖాతాలు తెరిపించాడు.

 సైబర్‌‌  మోసాల్లో కొల్లగొట్టిన సొమ్మును ఈ బ్యాంకు ఖాతాల్లోకి జమ అయిన తర్వాత రజీయుద్దీన్‌‌  వాటిని విత్‌‌డ్రా చేసి క్రిప్టో రూపంలో విదేశీ ఖాతాలకు తరలిస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక నిందితుడు విదేశాల్లో ఉంటూ, వీరితో ఈ పని చేయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాగా.. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులపై క్లిక్‌‌  చేయవద్దని ప్రజలకు అధికారులు సూచించారు.