హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు టెట్ చైర్‌పర్సన్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ రమేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 8న రెండు సెషన్లలో, 9న ఒక సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇన్-సర్వీస్ టెట్ పరీక్షకు 24,983 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, హాల్ టికెట్ల సమాచారం కోసం https://schooledu.telangana.gov.inను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే జిల్లాలవారీగా పరీక్షా కేంద్రాల ఎంపిక, ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. కాగా, సెప్టెంబర్ 8న ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు పేపర్-1 పరీక్ష ఉంటుంది.
