బీ అలర్ట్.. వాట్సాప్ ఘోస్ట్‌‌ పెయిరింగ్‌‌ ఎటాక్‌‌..మెసేజీలు సీక్రెట్ గా చూస్తున్న హ్యాకర్లు

బీ అలర్ట్.. వాట్సాప్  ఘోస్ట్‌‌  పెయిరింగ్‌‌ ఎటాక్‌‌..మెసేజీలు సీక్రెట్ గా చూస్తున్న హ్యాకర్లు
  • క్రోమ్​లో హ్యాకింగ్ లింకులు
  • మెసేజీలు, చాట్​లను సీక్రెట్ గా చూస్తున్న హ్యాకర్లు
  • అప్రమత్తంగా ఉండాలని సైబర్  సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: సైబర్‌‌  నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ ఘోస్ట్‌‌  పెయిరింగ్‌‌ ఎటాక్‌‌, క్రోమ్‌‌ ఎటాక్‌‌లు షురూ చేశారని తెలంగాణ సైబర్‌‌ సెక్యురిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌బీ) హెచ్చరించింది. 

క్రోమ్‌‌లో హానికరమైన, అనుమానాస్పద లింక్‌‌లపై క్లిక్‌‌  చేస్తే వెంటనే వ్యక్తిగత, బ్యాంకులకు సంబంధించిన సమాచారం చోరీ చేస్తున్నారని టీజీసీఎస్‌‌బీ డైరెక్టర్‌‌  శిఖా గోయల్‌‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

వాట్సాప్‌‌లో వచ్చే సందేశాల్లో ఉండే అనుమానాస్పద లింక్‌‌లపై క్లిక్‌‌  చేయగానే సైబర్‌‌ నేరగాళ్లు ఘోస్ట్‌‌  పెయిరింగ్‌‌  ఎటాక్‌‌కు పాల్పడుతన్నారని చెప్పారు. 

అనుమానాస్పద లింక్‌‌పై క్లిక్‌‌ చేయగానే మనకు తెలియకుండానే మన వాట్సాప్‌‌  అకౌంట్‌‌ను సైబర్‌‌  నేరగాళ్లు వారి డివైజ్‌‌కు లింక్‌‌ చేస్తున్నారు. 

ఇలా వాట్సాప్‌‌ లింక్‌‌  అయిన తర్వాత మనకు వచ్చే, మనం పంపే మెసేజీలు, చాట్‌‌లను హ్యాకర్లు సీక్రెట్‌‌గా గమనిస్తూ మన సమాచారం సేకరిస్తున్నారు. ఘోస్ట్‌‌  ఎటాక్‌‌  జరిగినప్పటికీ మన వాట్సాప్‌‌  సాధారణంగానే పనిచేస్తుంది” అని శిఖా గోయల్  వివరించారు. 

మన వాట్సాప్‌‌ ను ఇతరులు లింక్‌‌  చేసుకున్నట్లు అనుమానిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

చేయాల్సినవి..:

  • వాట్సాప్‌‌ కు లింక్‌‌   చేసిన పరికరాలను తనిఖీ చేయాలి.
  • ఏదైనా అనుమానాస్పదంగా డివైజ్‌‌లు లింక్‌‌  అయినట్లు కనిపిస్తే వెంటనే వాటిని తీసివేయాలి.
  • వాట్సాప్‌‌లో  ట్రూ ఫ్యాక్టర్‌‌  అథంటికేషన్​ను  యాక్టివేట్‌‌  చేసుకోవాలి.  
  • మీకు సంబంధించిన కీలక సమాచారం, ఫొటోలు, వీడియోలు వేరే చోట కాపీ చేసి పెట్టుకోవాలి.
  • అనుమానాస్పద సందేశాలు, లింక్‌‌లు, పాప్-అప్‌‌ల స్క్రీన్‌‌షాట్‌‌లను తీసుకోవాలి. 
  • లావాదేవీ ఐడీలు, యూటీఆర్‌‌ నంబర్‌‌లు, కాల్ లాగ్‌‌లను సేవ్  చేయాలి.
  • గూగుల్‌‌ క్రోం తాజా వెర్షన్‌‌కు అప్‌‌డేట్  కావాలి.
  • ఈ మెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌‌వర్డ్‌‌లను మార్చాలి.
  • క్రోమ్‌‌, యాప్‌‌లను ఎల్లప్పుడూ అప్‌‌డేట్‌‌  చేస్తూ ఉండాలి.  

చేయకూడనివి..

  • ఓటీపీ, పిన్‌‌, సీవీవీ లేదా వాట్సాప్‌‌  కోడ్‌‌లను ఎవరికీ  షేర్  చేయరాదు. 
  • ఎస్‌‌ఎంఎస్‌‌లు, ఈ-మెయిల్స్‌‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌‌లపై క్లిక్  చేయరాదు. 
  • తెలియని వెబ్‌‌సైట్‌‌లు లేదా పాప్-అప్‌‌లలో లాగిన్  అవకూడదు.