- టీజీఎంఎస్ఐడీసీ ఎండీకి ట్విన్ సిటీస్ మెడికల్ సప్లయర్ల విన్నపం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు మెడికల్ ఎక్విప్మెంట్, సర్జికల్ సామగ్రి సరఫరా చేస్తున్న సప్లయర్ల బకాయిలు రూ.445 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ తెలిపింది. బుధవారం టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్ ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో మందుల బిల్లులు రూ.200 కోట్లు, సర్జికల్ బకాయిలు రూ.110 కోట్లు, పరికరాలకు సంబంధించి రూ.125 కోట్లు ఉన్నాయని వివరించారు.
అధికారులు కేవలం మందుల సరఫరాకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారని, సర్జికల్ డిస్పోజబుల్స్, డయాగ్నస్టిక్ కిట్లు, పరికరాల బిల్లులను నిలిపివేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్జికల్, డయాగ్నస్టిక్ పరికరాలను కూడా డ్రగ్స్ పరిధిలోకి చేర్చినప్పటికీ, అధికారులు వాటి పేమెంట్లను పట్టించుకోవడం లేదని వాపోయారు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే ఆస్పత్రుల నిర్వహణకు సరుకు సరఫరా చేయడం కష్టమవుతుందని సప్లయర్లు స్పష్టం చేశారు.
