త్వరలో మరిన్ని  ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ స్టేషన్లు

త్వరలో మరిన్ని  ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ స్టేషన్లు
  • ఇప్పటికే హైదరాబాద్, చుట్టుపక్కల 14 ఏక్యూ స్టేషన్లు
  • మరో 13 ఏర్పాటు చేయడానికి కసరత్తు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  టీజీ​పీసీబీ హైదరాబాద్​లో గాలి నాణ్యతను తెలుసుకునేందుకు మరిన్ని కంటిన్యూస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్ లో ఈ స్టేషన్ల పెంపుదలపై చర్చించారు. ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో మొత్తం 14 ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, మరో 13 చోట్ల ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే ఉన్న కేంద్రాల ద్వారా నగరంలో ఎయిర్​క్వాలిటీ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో పీసీబీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఇవి 24 గంటలు పని చేస్తూ ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తున్నాయి. అయితే, థర్డ్ పార్టీ యాప్స్, కొన్ని వెబ్​సైట్స్​లలో అసలు నమోదవుతున్న వాల్యూస్​కు మించి ఇస్తుండడంతో జనాలు భయపడుతున్నారు. దీంతో పక్కా సమాచారం, పారదర్శకత కోసం మరిన్ని స్టేషన్లను పెంచాలని పీసీబీ నిర్ణయించుకుంది. 

ఇప్పటివరకు ఎక్కడెక్కడున్నాయంటే..

గచ్చిబౌలిలోని సెంట్రల్​వర్సిటీ, సనత్​నగర్​లోని టీఎస్ పీసీబీ, బహుదూర్ పురాలోని నెహ్రు జూ పార్క్, పాశమైలారం ఇండస్ట్రియల్ పార్క్ , బొల్లారంలోని కెన్నడీ స్కూల్, పటాన్ చెరువులోని ఇక్రిశాట్, కొంపల్లి మున్సిపల్ ఆఫీస్, కాప్రాలోని జీహెచ్ఎంసీ ఆఫీసు, కోకాపేట్ కమ్యూనిటీ హాల్, మలక్ పేట్ ఫ్లై ఓవర్ దగ్గరున్న లూయి బ్రెయిలీ పార్క్, బీరంగూడలోని సింఫనీ పార్క్, కంది ఐఐటీ, నాచారం,  ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు .