ఆర్టీసీని త్వరగా విలీనం చేయాలి.. ఐఎన్టీయూసీ డిమాండ్

ఆర్టీసీని త్వరగా విలీనం చేయాలి.. ఐఎన్టీయూసీ డిమాండ్

నారాయణగూడ, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని ఆర్టీసీ యాజమాన్యం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్ ఆరోపించారు. ఆదివారం నారాయణగూడలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జరిగిన యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశ్ గౌడ్​తో కలిసి ఆయన మాట్లాడారు. విలీన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ త్వరలోనే సీఎం, మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. 

అలాగే రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీస్​లో ఉన్నవారికి రావాల్సిన ఏరియర్స్ చెల్లించేందుకు యాజమాన్యం వద్ద నిధులు లేవని, వెంటనే ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్​ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఇటీవల సమ్మె సమయంలో ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రతి కార్మికుడు రూ.300 ఇవ్వాలనే ఐఎన్టీయూసీ ప్రతిపాదనకు యాజమాన్యం అంగీకరించిందని.. కాబట్టి డిపోల వద్ద ప్రతిఒక్కరూ ఆప్షన్ ఫామ్​పై సంతకం చేసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.