స్కూల్స్ రీ ఓపెన్... రేపటి(జూన్ 15 ) నుంచి విద్యార్థుల కోసం స్పెషల్ బస్సులు

స్కూల్స్ రీ ఓపెన్... రేపటి(జూన్ 15 ) నుంచి  విద్యార్థుల కోసం స్పెషల్ బస్సులు

వేసవి సెలవుల అనంతరం జూన్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి గాను స్కూళ్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో.. విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో విద్యార్థుల కోసం తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల పాఠశాల సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా.. ఉదయం, సాయంత్రం వేళల్లో కచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు.