- తెలంగాణతో పాటు ఏపీలోని పలు డిపోల నుంచి రాకపోకలు
- కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో ఈ నెల 27న జరిగే శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఏపీ, టీజీఎస్ ఆర్టీసీల ఆధ్వర్యంలో 406 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం భద్రాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల పార్కింగ్ ప్లేస్, సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన రివ్యూలో మాట్లాడారు.
ఖమ్మం రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి భద్రాచలంకు ప్రతి రోజు 113 బస్సులు తిరుగుతున్నాయని, శ్రీరామనవమి రోజున అదనంగా 121 బస్సులను తిప్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోని విజయవాడ, తిరువూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, కాకినాడ, విశాఖపట్టణం, రాజమండ్రి డిపోల నుంచి నిత్యం 45 బస్సులు తిరుగుతున్నాయని, నవమి రోజున అదనంగా 127 బస్సులు నడుస్తాయన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో మహాలక్ష్మి, ఏపీలో స్త్రీశక్తి పథకం అమలవుతున్నందున భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఏపీ వైపు వెళ్లే బస్సులకు జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించామని చెప్పారు. రివ్యూలో ఖమ్మం ఆర్‌ఎం.సరిరామ్, డిప్యూటీ ఆర్‌ఎం రవీందర్ పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణానికి పోచంపల్లి చేనేత పట్టువస్త్రాలు
భద్రాచలంలో ఈ నెల 27న జరిగే సీతారాముల కల్యాణం కోసం పోచంపల్లి చేనేత పట్టువస్త్రాల తయారీని గురువారం ఈవో దామోదర్‌రావు ప్రారంభించారు. సికింద్రాబాద్‌కు చెందిన చేనేత కళాకారులు కొన్నేండ్లుగా రంగనాయకులగుట్టపై ఉన్న భక్తరామదాసు ధ్యానమందిరంలో పోచంపల్లి చేనేత పట్టువస్త్రాలను తయారు చేసి సీతారాములకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో దామోదర్‌రావు, అర్చకులు మగ్గాలకు ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రాల తయారీని ప్రారంభించారు.
