
ఆర్టీసీ నష్టపోతుందని..సమ్మెకు వెళ్తొద్దని కార్మికులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. మే 5న ఉదయం ఆర్టీసీ జేఏసీ సంఘాలతో భేటీ అయిన పొన్నం.. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,కార్మికుల సంక్షేమం ,ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు.గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు ,ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. సీసీఎస్, పీఎఫ్ పైసలు వాడుకున్నారు.TGSRTC ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించింది. 2017 పే స్కేల్ 21% శాతం ఇచ్చింది. సంవత్సరానికి రూ. 412 కోట్ల భారం పడుతుంది. పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగ పెండింగ్ లో ఉన్న రూ.1039 కోట్లు చెల్లించాం. నెలవారీ PF కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తాం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ. 345 కోట్లు రూపాయలు చెల్లించాం. నెలవారీ CCS కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తాం. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినం. ప్రభుత్వం TGSRTCలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేశాం ,తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ గా మార్చాం అని పొన్నం అన్నారు.