ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ : వైఎస్ షర్మిల

ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ : వైఎస్ షర్మిల

తమ పార్టీ శ్రేణులను ఉద్దేశించి వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోసారి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలను గుండాలతో పోల్చుతూ ట్వీట్ చేశారు. 

పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరినపుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దాడులకు పాల్పడినపుడు పార్టీలకు అతీతంగా నిలదీయడం అందరి కర్తవ్యమని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తన పోరాటానికి మద్దతు తెలిపి, ప్రభుత్వ దాడిని ఖండించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖను ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పారు.

ఒకప్పుడు టీఆర్ఎస్ ఉద్యమకారుల పార్టీ అని, ఇప్పుడు ‘గూండాల పార్టీ, బంధిపోట్ల పార్టీ’గా మారిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఒక మహిళ 3500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి, కేసీఆర్ మోసాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే..ఓర్వలేక తమపై పెట్రోల్ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడడం తమ తప్పా..? అని నిలదీశారు. ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ అని కామెంట్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తాలిబన్ అని, నర్సంపేటలో, హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ నేతలు, పోలీసులేనని వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఆర్ఎస్ వాళ్లను వదిలిపెట్టి, తమను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 

దాడులు చేసే హక్కు పోలీసులకు ఎక్కడిది..? అని షర్మిల ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుని, గూండాలకు కొమ్ముకాస్తారా? అని ట్విట్టర్ లో నిలదీశారు.