టీఆర్​ఎస్​ దొంగ ఓట్లను  నమోదు చేస్తోంది: తరుణ్​చుగ్

టీఆర్​ఎస్​ దొంగ ఓట్లను  నమోదు చేస్తోంది: తరుణ్​చుగ్
  • మునుగోడు ఓటర్ లిస్ట్​లో అవకతవకలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
  • ఈ బైపోల్ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి.. కుటుంబపాలన, అవినీతికి మధ్య పోరు
  • రాచకొండ సీపీని బదిలీ చేయాలి... రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడం ఖాయం

న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు ఓటర్ల నమోదులో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిం దని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్​చుగ్ ఆరోపించారు. గురువారం దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల లిస్ట్ లో కొత్త  ఓట్లపై ఎంక్వైరీ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. రెండు నెలల్లోనే మునుగోడులో 25వేల కొత్త ఓట్లు నమోదయ్యాయని.. టీఆర్ఎస్ దొంగ ఓట్లను చేరుస్తోందని ఆరోపించారు. 

ఓటమి భయంతో టీఆర్ఎస్ పక్క నియోజకవర్గాల నుంచి తమ కార్యకర్తలను చేర్పించిందని విమర్శించారు. ఓటర్ లిస్ట్​లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీ ని కోరినట్లు చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపును వాళ్లు ఆపలేరన్నారు. ఈ బైపోల్​తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి.. సీఎం కేసీఆర్ కుటుంబపాలన, అవినీతికి మధ్య జరుగుతున్న పోరు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాలనను వదిలిపెట్టి మునుగోడులో తిష్ట వేశారన్నారు. కేసీఆర్ సెక్రటేరియెట్​ను హైదరాబాద్ నుంచి మునుగోడుకు షిప్ట్ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో సర్కార్ కార్యకలపాలు ఆగిపోయాయని.. ఉద్యోగులు సంతకాల కోసం మునుగోడు చుట్టు తిరుగుతున్నారని చెప్పారు. 

2016 నుంచి ఒచే చోట మహేశ్​ భగవత్..

రాచకొండ సీపీగా మహేశ్ భగవత్‌‌‌‌‌‌‌‌ 2016 నుంచి కొనసాగుతున్నారని.. ఆయన్ను బదిలీ చేయాలని ఈసీకి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. ఆయన కొనసాగింపు ఈసీ గైడ్​లైన్స్ ఉల్లంఘించడమేనని తెలిపారు. భగవత్ మూడేండ్లకు పైగా ఈ పదవిలో ఉన్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. సీపీతోపాటు ఒకే చోట మూడేండ్లు పూర్తి చేసుకున్న అధికారులను ఈసీ మార్గదర్శకాల ప్రకారం బదిలీ చేయాలని కోరారు.

టీఆర్ఎస్ 25 వేల నకిలీ ఓట్లు సృష్టించింది

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను సృష్టించిందని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు. ఈ ఫేక్ ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.  ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికల్లో 2వేల ఓట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదని కానీ ఇప్పుడు ఏకంగా 25 వేల ఓటర్లు కొత్తగా చేరారన్నారు. నాలుగేండ్ల నుంచి ఒకేచోట ఉన్న పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఈసీని కలిసిన వారిలో కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, రాష్ట్ర బిజేపీ నాయకుల ఎన్ రాంచందర్ రావు ఉన్నారు.