అంగన్ వాడీ కేంద్రమే తిండికి దిక్కయ్యింది

అంగన్ వాడీ కేంద్రమే తిండికి దిక్కయ్యింది

ప్రతిరోజు కూలి పనికి వెళ్లే అతడికి యాక్సిడెంట్ కారణంగా కాలు, చేయి పడిపోవడంతో భార్యా పిల్లలను పోషించడం కష్టంగా మారింది. తిండి కోసం భార్యాపిల్లలు అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఊళ్లో తనకున్న భూమిని అమ్ముదామనుకున్నా.. అందులో ట్రాన్స్​ఫార్మర్ ఉండడంతో కొనేందుకు ఎవరూ రావడం లేదు. దాన్ని అక్కడి నుంచి తరలించాలని విద్యుత్ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదు. ఇదీ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం గ్రామపంచాయతీకి చెందిన శ్రీధర్ నాయక్(31) పరిస్థితి. అన్నారం పరిధి కొండయ్య తండాలో ఉండే శ్రీధర్ నాయక్​కు భార్య కీర్తన, ఇద్దరు పిల్లలున్నారు. కూలి పనిచేసే అతడికి 9 నెలల కిందట బైక్​పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. గాయపడ్డ శ్రీధర్ కోమాలోకి వెళ్లాడు. తర్వాత పెరాలసిస్ రావడతో ఎడమ కాలు, చేయి పడిపోయాయి. అతడు పనికి వెళ్లేందుకు వీలులేక ఇంట్లో ఉండటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అతడితో పాటు భార్యా పిల్లలకు ఇంటి పక్కనే ఉన్న అంగన్ వాడీ కేంద్రమే తిండికి దిక్కయ్యింది. అదే తండాలో శ్రీధర్​కు పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన 2 కుంటల పొలం ఉంది. కనీసం ఆ భూమిని అమ్ముకుంటే కష్టాలు తీరుతాయని భావించాడు. అతడి చిన్నతనంలోనే అక్కడ విద్యుత్ అధికారులు ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేశారు. దీంతో పొలాన్ని కొనేందుకు ఎవరూ రావడం లేదు. దాన్ని అక్కడి నుంచి తరలించాలని విద్యుత్ అధికారులను కోరితే.. అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరించాలని చెప్తున్నారని శ్రీధర్  కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కష్టాలు భరించలేక ఇటీవల రెండుసార్లు అతడు భార్యా పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా బంధువులు, స్థానికులు అడ్డుకున్నారు. విద్యుత్ అధికారులు తమ పొలంలో వేసిన ట్రాన్స్ ఫార్మర్​ను తొలగించాలని, ప్రభుత్వం తమ కుటుంబానికి జీవనోపాధిని కల్పించాలని శ్రీధర్ కోరుతున్నాడు. - వెలుగు, షాద్ నగర్