ఖైదీల విడుదల ప్రక్రియలో వేగం పెంచాలె

ఖైదీల విడుదల ప్రక్రియలో వేగం పెంచాలె

మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ముంబై: ఖైదీలకు బెయిల్ మంజూరు చేయడాన్ని వేగవంతం చేయాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ లేదా బెయిల్ ఇవ్వడానికి అర్హత ఉన్న ఖైదీలను, అండర్ ట్రయల్స్ ను విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. జైళ్ళలో రద్దీని తగ్గించడానికి ఏయే కేటగిరీ ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయవచ్చో నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు మార్చి 23న అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీని ఆధారంగా ఖైదీలను విడుదల చేయాలంటూ లాయర్ ఎస్బీ తలేకర్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్​పై జస్టిస్ జీఎస్ కులకర్ణి శుక్రవారం విచారణ చేపట్టారు. ఏడు సంవత్సరాల శిక్ష పడిన ఖైదీలను, ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడగలిగిన నేరాలు చేసిన అండర్ ట్రయల్స్ ను టెంపరరీ బేస్డ్ గా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపక్ ఠాక్రే కోర్టుకు తెలియజేశారు. ఈ లెక్కన సుమారు 11 వేల మంది ఖైదీలను 45 రోజుల పాటు అత్యవసర పెరోల్‌పై విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 4,060 మంది ఖైదీలను పెరోల్ / తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేశామని, మిగిలిన ఖైదీలను విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఠాకరే కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ ఖైదీలకు కరోనా రాలేదని తెలిపారు.