ఇయ్యాల్టి నుంచే ఆషాడం బోనాలు

ఇయ్యాల్టి నుంచే ఆషాడం బోనాలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాసం బోనాల జాతర గ్రేటర్ సిటీలో నేటి నుంచి ప్రారంభం కానుంది. గతేడాది కరోనా ఎఫెక్ట్​తో  ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో బోనాల ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి.  ఈ ఏడాది కరోనా రూల్స్ పాటిస్తూ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో సిటీతో పాటు రాష్ట్రమంతటా ఉత్సవాలు మొదలుకానున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ఊరేగింపును ప్రారంభించనున్నారు.  లంగర్ హౌస్ నుంచి అమ్మవారి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని ఆలయం వరకు కొనసాగనుంది.  లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు దారి పొడవునా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

300 సీసీ కెమెరాలతో నిఘా

గోల్కొండ బోనాలతో ప్రారంభమై లష్కర్, లాల్ దర్వాజ బోనాలు, బక్రీద్ లాంటి  పండగలు ఈ నెలలోనే  వరుసగా ఉండటంతో గ్రేటర్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. బోనాల సందర్భంగా గోల్కొండ పరిధిలో వెయ్యి మంది పోలీసులతో
బందోబస్తు ఏర్పాటు చేశారు. వెస్ట్‌‌‌‌జోన్ డీసీపీ ఏఆర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు 300, కోట లోపల 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  లంగర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌తో పాటు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో అనుమానితులపై నిఘా పెట్టారు. రౌడీ షీటర్లకు ఇప్పటికే కౌన్సిలింగ్‌‌‌‌ ఇచ్చారు. తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారా దర్వాజా, ఫతే దర్వాజా ప్రాంతాల్లో ఫుల్ సెక్యూరిటీ ఉంచారు.  జంక్షన్లలో పోలీస్ పికెట్లు పెట్టారు. ఆదివారం ఉదయం 8  నుంచి రాత్రి 8 గంటల వరకు రామ్‌‌‌‌దేవ్‌‌‌‌ గూడ, మక్కి దర్వాజ, లంగర్ హౌస్, ఫతే దర్వాజ, సెవెన్ టూంబ్స్ రూట్ల నుంచి గోల్కొండ కోటకు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు. వెహికల్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా రూల్స్​లో భాగంగా ఊరేగింపులో పాల్గొనే వారితో పాటు గోల్కొండ కోటలోని టెంపుల్​కి వచ్చే వారికి మాస్క్ తప్పనిసరి చేశారు.- అన్నిచోట్లా ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.

కోటలో 5 హెల్త్​ క్యాంపులు...

గోల్కొండ బోనాల సందర్భంగా కోట లోపల 5 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటి తెలిపారు. ఎంట్రెన్స్​లో శానిటైజర్ అందుబాటులో ఉంచామన్నారు. మాస్క్​లు లేకుండా వచ్చే వారికి మాస్క్​లను అందిస్తామన్నారు. కరోనా అనుమానం ఉన్నవారికి కొవిడ్ టెస్టులు కూడా చేస్తామన్నారు. లక్షణాలు ఉంటే మెడిసిన్స్ ఇచ్చి పంపుతామన్నారు.

వెహికల్ పార్కింగ్‌‌ ఏరియాలు

  • రామ్​దేవ్ గూడ, మక్కి దర్వాజ నుంచి వచ్చే బైక్​లు మిలటరీ సెంట్రీ పాయింట్ దగ్గర, కార్లను అషుర్​ ఖానాలో పార్కింగ్ చేయాలి.
  • లంగర్‌‌హౌస్‌‌ నుంచి వచ్చే  బైక్​లు, ఆటోలు హుడా పార్కు వద్ద, కార్లు సలార్ ఫుట్ బాల్ గ్రౌండ్​లో పార్కింగ్ చేయాలి.
  • సెవెన్ టూంబ్స్ నుంచి వచ్చే బైక్​లు, ఆటోలు ప్రియదర్శిని స్కూల్, ఏరియా హాస్పిటల్, గోల్కొండ బస్టాప్ వద్ద, కార్లను సలార్ ఫుట్ బాల్ గ్రౌండ్​లో పార్కింగ్ చేయాలి. 

సిటిలో బోనాలు ఇలా..  

  • నేడు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం. 25న సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాలు 26న రంగం  
  • ఆగస్టు 1న లాల్ దర్వాజ  మహంకాళి అమ్మవారి బోనాలు, 
  • 2న ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.