సీసీ కెమెరాలకు దొరక్కుండా గుట్టలదగ్గరకు తీసుకెళ్లాడు

సీసీ కెమెరాలకు దొరక్కుండా గుట్టలదగ్గరకు తీసుకెళ్లాడు

దీక్షిత్ ఏడుస్తుంటే కంట్రోల్ చేయలేక చంపేశాడు-జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్ జిల్లా: తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన దుండగుడు తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఇంటి నుండి గుట్ట వరకు దారిలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలున్నాయో తెలుసుకుని రెక్కీ నిర్వహించాడని.. ఎక్కడా కెమెరాలకు దొరక్కూడదని.. అవి లేని మార్గాల్లో బైకుపై కూర్చొబెట్టుకుని తీసుకెళ్లాడని ఆయన వివరించారు. నిందితుడు మందసాగర్ ను అదుపులోకి తీసుకుని.. పక్కా ఆధారాలతో నేరం జరిగిన తీరును గుర్తించామన్నారు. నిందితుడితో సీన్ రీ కన్ స్ర్టక్షన్ చేసి దీక్షిత్ రెడ్డి కిడ్నాప్..  హత్య పై డీటెల్డ్ గా చార్జిషీట్ తయారు చేస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడ్ని కిడ్నాప్ చేసిన నిందితుడు  కిరాతకంగా చంపి..  హైటెక్ పద్దతిలో టెక్నాలజీ ఉపయోగించి  డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. నిందితుడు మంద సాగర్ ను అరెస్ట్ చేసి అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 18  సాయంత్రం 5.30 గంటల సమయంలో నేరస్థుడు పధకం ప్రకారం తన బైకుకు  ఏపీ 36 క్యూ 8108 అనే  ఫేక్ నెంబర్ ప్లేటు పెట్టుకుని బైక్ పై  దీక్షిత్ ను తీసుకెళ్లాడన్నారు. దారిలో ఎక్కడా సీసీ కెమెరాల కు దొరకకుండా దానమయ్య   గుట్ట దగ్గర తీసుకెళ్లాడన్నారు. చీకటిపడుతుటే దీక్షిత్  ఏడవడం మొదలు పెట్టాడని.. ఓదార్చేందుకు చాక్లెట్లు.. బిస్కెట్లు ఇచ్చాడన్నారు. తాను కంట్రోల్ చేయలేనని గుర్తించి దీక్షిత్ కు మత్తు టాబ్లెట్ ఇచ్చి కర్చీఫ్ తో చేతులు కట్టేశాడని..  దీక్షిత్  టీ షర్ట్ తో మెడకు ఉరి బిగించి చంపేశాడన్నారు. నేరం చేసిన స్థలం నుండి దీక్షిత్ తల్లికి ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. మంద సాగర్ ఒక్కడు మాత్రమే ఈ హత్యలో పాల్గొన్నాడని.. మిగత వారికి నేరంతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణ అయిందని జిల్లా ఎస్పీ తెలిపారు.