ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్

కరీంనగర్ టౌన్: ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ఉప ఎన్నికతో కుట్రకు తెరలేపిందని, మునుగోడు బైపోల్స్ లో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా లైబ్రరీలో నిర్వహించిన సమావేశంలో మేయర్ సునీల్ రావుతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ టికెట్​తో గెలిచినా మూడేళ్ల నుంచి రాజగోపాల్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నాడని గుర్తు చేశారు. ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై జనం నిరసన తెలుపుతున్నారన్నారు.  గవర్నర్ తమిళిసై శాసన మండలి బిల్లులు ఎందుకు ఆమోదం తెలపలేదో ఆమె చెప్పాలని, డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీల్లో 2 వేల ఖాళీలకు చెందిన ఉద్యోగాల నియామకం బిల్లు ఉందని, గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో డిప్యూటీమేయర్ స్వరూపారాణి, లైబ్రరీ చైర్మన్ అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

పోషకాహారంతోనే ఆరోగ్యకర సమాజం 

గంగాధర:   పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని వినోద్ కుమార్ అన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా బుధవారం గంగాధర మండలం గర్షకుర్తి జడ్పీహెచ్ఎస్ లో  రూ.27.29 లక్షలతో నిర్మించనున్న  డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ కు శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు టిఫిన్​అందించేందుకు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ ఉచిత అల్పాహార సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ దేశంలోని 18 రాష్ట్రాల ప్రభుత్వ స్కూల్​విద్యార్థులకు అల్పాహారం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, డీఈఓ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రగతి భవన్​కు చేరేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం

నేడు బంద్​కు పిలుపు 

చొప్పదండి,వెలుగు: ప్రగతిభవన్​కు చేరేలా ప్రతీ ఇంటి నుంచి పోస్టుకార్డు ఉద్యమం నిర్వహిస్తామని చొప్పదండి పట్టణ జేఏసీ సభ్యులు తెలిపారు. మున్సిపాలిటీలలో పెరిగిన ఇంటి పన్నులు తగ్గించాలని జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నులు తగ్గించాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు పోస్ట్ కార్డులు పంపామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్​అధికారులు వారితో మాట్లాడారు. కొత్తగా పన్నుల రేట్లు పెంచలేదని, భూముల మార్కెట్ రేట్​కు అనుగుణంగా పన్ను వచ్చిందన్నారు. ఆందోళన విరమించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అయితే పన్నుల తగ్గింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ సభ్యులు పేర్కొన్నారు. గురువారం పట్టణ బంద్ పాటించాలని జేఏసీ పిలుపునిచ్చింది.

మతతత్వ శక్తులను అడ్డుకునేందుకే జోడో యాత్ర

జగిత్యాల, వెలుగు: దేశాన్ని మతాల పేరుతో విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్న మతతత్వ శక్తులను అడ్డుకుని, ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్​జోడో యాత్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల ఇందిరా భవన్ లో కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, లీడర్లతో కలిసి జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ భారత జాతి ఐక్యతను కాపాడేందుకు రాహుల్ యాత్ర చేపట్టారన్నారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మెట్​పల్లి జెడ్పీటీసీ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజీనామా చేస్తేనే నిధులిస్తారా?

గంగాధర, వెలుగు: ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే ప్రభుత్వం నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తోందని, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కూడా రాజీనామా చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. గంగాధర మండల కేంద్రానికి చెందిన కొండ వెంకటేశం ఇటీవల మృతి చెందగా బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.7 వేల సహాయం అందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సత్యం మాట్లాడారు. నియోజకవర్గంలో మండల, గ్రామీణ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆర్అండ్ బీ, ఈఎన్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో గంగాధర, రామడుగు మండలాధ్యక్షులు మనోహర్, తిరుపతి, టీపీసీసీ మెంబర్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆయిల్ పామ్ తో అధిక లాభాలు 

ఎల్లారెడ్డిపేట,వెలుగు: ఆయిల్​పామ్ సాగుకు మన నేలలు అనుకూలమని, రైతులు దృష్టి సారించి అధిక  లాభాలు పొందొచ్చని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం చంద్రంపేటలోని ఆయిల్​పామ్ నర్సరీని, ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేటలోని పాతూరి భూపాల్ రెడ్డి , ఓరుగంటి అభినయ్ సాగు చేస్తున్న తోటను కలెక్టర్ సందర్శించారు. ఆయిల్​పామ్ చెట్టు సగటున 30 నుంచి 40 ఏళ్ల పాటు పంట ఇస్తూనే ఉంటుందన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 1,800 ఎకరాలు సాగు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికి 760 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, క్లస్టర్ అధికారి స్రవంతి, జైన్ కంపెనీ ఏరియా మేనేజర్ దివాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

ప్రతి ధాన్యపు గింజను కొంటాం 

గంగాధర, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, రైతు పండించిన ప్రతి గింజను కొంటామని చొప్పదండి ఎమ్మెల్యే ఎస్. రవిశంకర్ అన్నారు. బూరుగుపల్లిలోని తన ఇంట్లో చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల పీఏసీఎస్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, సెక్రటరీలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేసి మిల్లులకు పంపించాలన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్లు వెంకటేశ్వరరావు, బాలాగౌడ్, మల్లారెడ్డి, నరేందర్ రెడ్డి, రాజనర్సింగరావు, మార్కెట్ కమిటీల చైర్మన్లు ఎల్లయ్య, తిరుపతి పాల్గొన్నారు.