మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్ట్
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్ రామచంద్రపిళ్లై, ముత్తా గౌతమ్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, సమీర్ మహేంద్రుకు సీబీఐ స్పెషల్ కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్‌పాల్ వీరికి 30 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ కేసులో పిళ్లై, గౌతమ్, కుల్దీప్, నరేంద్రలకు.. ఈడీ కేసులో సమీర్ కు బెయిల్ వచ్చింది. సమీర్ మహేంద్రు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అయితే ఈ కేసులో రాష్ట్రానికి చెందిన అరుణ్ పిళ్లై, ముత్తా గౌతమ్‌ను గతంలోనే సీబీఐ అరెస్ట్ చూపినట్లు తెలిసింది. కోర్ట్ అనుమతితోనే వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు సమాచారం.
షరతులు అతిక్రమిస్తే రద్దు
బెయిల్ కోసం నిందితులు ఒక్కొక్కరు రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తు, ఒకరి ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, నేర పూరిత కార్యకలాపాలకు పాల్పడరాదని ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎప్పుడు కోరినా దర్యాప్తునకు హాజరై సహకారం అందించాలని సూచించింది. షరతులు అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. సీబీఐ కేసులో అరెస్టయిన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి గతంలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈడీ కేసులో వారిద్దరూ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ 12 మందిని అరెస్ట్ చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు ఏడుగురికి బెయిల్ దొరికింది. సమీర్ మహీంద్రు గ్లాడ్ బ్లాడర్ ఆపరేషన్ కోసం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
