సికిల్ సెల్ ఎనీమియాను 2047 నాటికి నిర్మూలిస్తం.. మిషన్​ను ప్రారంభించిన మోడీ

సికిల్ సెల్ ఎనీమియాను 2047 నాటికి నిర్మూలిస్తం.. మిషన్​ను ప్రారంభించిన మోడీ

సికిల్ సెల్ ఎనీమియాను 2047 నాటికి నిర్మూలిస్తం.. 

మిషన్​ను ప్రారంభించిన మోడీ

షాహ్దోల్ (మధ్యప్రదేశ్​) : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని  2047 నాటికి నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ‘నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎరాడికేషన్ మిషన్ 2047’ను ప్రారంభించింది. ఈ మిషన్ ను శనివారం మధ్యప్రదేశ్ లోని షాహ్దోల్​లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించడంతో పాటు సికిల్ సెల్ ఎనీమియా నివారణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు. కొంతమందికి సికిల్ సెల్ కలర్ కోడెడ్ కౌన్సెలింగ్ కార్డులు అందజేశారు. ఆయుష్మాన్ డిజిటల్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. రాణి దుర్గావతి 500వ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని, స్టాంపులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై మోదీ విమర్శలు చేశారు. కుటుంబ రాజకీయాలుచేస్తున్న కాంగ్రెస్ ఫేక్ హామీలు ఇస్తున్నదని, అలాంటి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాగా, డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లకు.. సీఏ డే సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్లు చేశారు.

వ్యవసాయ రంగంపై ఏటా రూ.6.5 లక్షల కోట్ల ఖర్చు

న్యూఢిల్లీ : వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం కోసం ఏటా రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. శనివారం ఢిల్లీలో 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత తొమ్మిదేండ్లలో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను వివరించారు. ‘‘మా ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఏటా ఏదో ఒక విధంగా రూ.50 వేల సాయం అందుతున్నది. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నం. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేశాం. పీఎం కిసాన్ కింద ఏటా రూ.6 వేలు ఇస్తున్నం. దీని కింద ఇప్పటి వరకు రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చినం. ఎరువుల సబ్సిడీ కింద మరో రూ.10 లక్షల కోట్లు ఇచ్చాం. విదేశాలతో పోలిస్తే మన దగ్గరే ఎరువుల రేట్లు తక్కువ ఉన్నాయి” అని చెప్పారు. తాము కేవలం హామీలకే పరిమితం కావడం లేదని, అమలు చేస్తున్నామని తెలిపారు.