మేడారం జాతరపై కేంద్రం వివక్ష..అడిగింది 15 కోట్లు ఇచ్చింది 2 కోట్లే

మేడారం జాతరపై కేంద్రం వివక్ష..అడిగింది 15 కోట్లు ఇచ్చింది 2 కోట్లే
  • ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరపై కేంద్రం వివక్ష
  •     రూ.15 కోట్లతో వివిధ పనులకు ప్రపోజల్స్ పంపిన ట్రైబల్ శాఖ
  •     అడిగిన దాంట్లో కనీసం 20 శాతం కూడా ఇవ్వని కేంద్రం
  •     జాతీయ హోదాతో పాటు రూ.150 కోట్లు కోరిన సీఎం
  •     ఏ ఒక్కటి పట్టించుకోని కేంద్రం
  •     కుంభమేళాకు మాత్రం రూ.2,100 కోట్లు మంజూరు

హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–-సారలమ్మ జాతర పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నది. యూపీలో జరిగే కుంభమేళాకు సుమారు రూ. 2,100 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, కోట్లాది మంది ప్రజలు, గిరిజనుల దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారానికి మాత్రం నామమాత్రపు నిధులు కూడా ఇవ్వడం లేదు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇంత మంది వచ్చే మేడారం జాతరను కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని తెలంగాణ ప్రజలు, నేతలు ప్రశ్నిస్తున్నారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా రాష్ట్రం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని, ఇది గిరిజన సంస్కృతిని అవమానించడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్రం మేడారానికి కేవలం రూ.2 నుంచి రూ.3 కోట్లు కేటాయించగా, ఈసారి ఇప్పటి వరకు కేంద్రం రూ.2.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులు రూ. 250 కోట్లకు పైగా కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టింది. కేంద్రం ఇప్పటికైనా వివక్షను వీడి, కోట్లాది ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది.

కేవలం రూ.2.90 కోట్లు మంజూరు

దక్షిణాది కుంభమేళాగా ప్రఖ్యాతి గాంచిన  మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 2.90 కోట్లు మంజూరు చేసింది. గిరిజన జాతర కావటంతో కేంద్ర ట్రైబల్ శాఖ (మోటా) నుంచి వసతుల కల్పనకు, శాశ్వత నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని.. షెడ్లు, మ్యూజియం, ఇతర పనుల కోసం రూ.15 కోట్లతో మూడు నెలల కింద రాష్ట్ర గిరిజిన శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు ఆ కొద్ది పాటి ఫండ్స్ విడుదలకు అంగీకారం తెలిపింది. కల్చరల్ ప్రమోషన్, వివిధ రాష్ట్రాల ట్రైబల్ కళాకారులతో నేషనల్ డాన్స్ ఫెస్టివల్, ట్రైబల్ ఫుడ్ ఫెస్టివల్, క్రాఫ్ట్ మేళా నిర్వహణకు ఈ నిధులు మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు. వాటిని కూడా జాతర ప్రారంభం కావడానికి పది రోజుల ముందు రిలీజ్​చేశారు. అయితే మేడారం జాతరకు నిధుల కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్, బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని రాష్ట్ర నేతలు, ప్రజలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి నిధులు మంజూరు చేసేలా చొరవ చూపాలంటున్నారు. 

150 కోట్లు, జాతీయ హోదా ఇవ్వండి

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ‘మేడారం సమ్మక్క–సారలమ్మ’ మహాజాతర (2026) నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేయాలని, జాతరకు ‘జాతీయ పండుగ’ గుర్తింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్రం స్పందన కోసం ఎదురుచూస్తూనే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ జాతర కోసం రూ. 251 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ. 150 కోట్లతో జాతర నిర్వహణ, ఏర్పాట్లు, రూ.101 కోట్లతో గద్దెల విస్తరణ, శాశ్వత అభివృద్ధి పనులకు ఖర్చు చేసింది. కొన్నేండ్లుగా ఏడాదంతా మేడారం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం పలు నిర్మాణాలు చేపడుతున్నది. ఏటూరునాగరం ఐటీడీఏ పరిధిలో భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి ఐదు షెడ్లు ఉండగా మరో 10 నిర్మించాలని రాష్ట్ర ట్రైబల్ అధికారులు ప్రతిపాదించారు. వీటిలో తొలి దశలో కొంగలమడుగు, చింతల్ క్రాస్ రోడ్ షెడ్లు నిర్మించాలని, ఇందుకు ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రతిపాదించారు. 

కేంద్రానికి పంపిన మేడారం పనుల వివరాలు

  •     ట్రైబల్ మ్యూజియం రెనోవేషన్, గ్యాలరీ, ట్రైబల్ విలేజ్ గుడిసెల ఏర్పాటు– రూ.1.50 కోట్లు
  •     గిరిజన సంప్రదాయాలతో స్మృతి వనం (29 ఎకరాల్లో) నిర్మాణం– రూ.5 కోట్లు 
  •     కోయ పూజారులకు కొబ్బరి నూనె తయారీ కేంద్రం– రూ.1 కోటి
  •     మేడారం జాతర దగ్గర సీసీ రోడ్లు, డ్రైనేజీలు– రూ.1 కోటి
  •     కొంగలమడుగు గ్రామంలో భక్తుల విశ్రాంతికి షెడ్ నిర్మాణం– రూ.2 కోట్లు
  •     చింతల్ గ్రౌండ్ క్రాస్ రోడ్ దగ్గర షెడ్ నిర్మాణం– రూ.2 కోట్లు