బిడ్డను సాకలేనంటూ పోలీసులకు అప్పగించింది

బిడ్డను సాకలేనంటూ పోలీసులకు అప్పగించింది

పోలీసులకు అప్పగించిన తల్లి
జగిత్యాల, వెలుగు: బిడ్డను సాకేందుకు బిచ్చం ఎత్తిన పైసలు నా భర్త తాగుడుకు గుంజుకుంటుండు.. రోగాల పాలైన.. బిడ్డను సాకలేను మీరే చేరదీయాలంటూ ఓ తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి చిన్నారిని అప్పగించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ కు చెందిన కస్తూరి మహేశ్వరి తన భర్త వెంకటేశ్​తో కలిసి కొన్ని నెలలుగా మంచినీళ్ల బావి వద్ద ఓ కులసంఘ భవనంలో ఆశ్రయం పొందుతోంది. భర్త తాగుబోతు కావడంతో నిత్యం కుటుంబంలో గొడవలు జరిగేవి. ఏడాదిన్నర కూతురి కోసం భిక్షాటన చేసి వచ్చిన పైసలతో చిన్నారి ఆలనాపాలన చూసేది. కాగా ఇటీవల బిచ్చమెత్తి  తెచ్చిన పైసలను భర్త కొట్టి తీసుకుంటున్నాడు. మరోవైపు ఆమె సైతం అనారోగ్యం పాలైంది. దీంతో తాను బతుకుతానో లేదోననే ఆందోళనకు గురైంది. తన కూతురినైనా కాపాడాలంటూ జగిత్యాల పోలీస్​స్టేషన్ కు వెళ్లింది. స్పందించిన పోలీసులు ఆమెకు భోజనం పెట్టించారు. తీవ్ర అస్వస్థత తో ఉన్న ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సఖి సెంటర్ నిర్వాహకులకు సమాచారం అందించారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ హరీశ్​అక్కడకు చేరుకుని ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి సఖి సెంటర్ కు తరలించారు.