మనపై ఎందుకీ వ్యతిరేకత?.ఉద్యమం నుంచి వెంట ఉన్నయూత్​కు ఏమైంది?

మనపై ఎందుకీ వ్యతిరేకత?.ఉద్యమం నుంచి వెంట ఉన్నయూత్​కు ఏమైంది?
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  సీఎం కేసీఆర్
  • మనం తెచ్చిన చట్టాలు ప్రజల మేలు కోసమే
  • కేంద్రం చెప్పేదొకటి.. చేసేది మరొకటి
  • రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలుపు మనదే
  • దుబ్బాకలో మంచి మెజార్టీతో గెలుస్తం
  •  జీహెచ్​ఎంసీలో వందకుపైగా సీట్లు సాధిస్తామని ధీమా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత పెరుగుతోందని సీఎం కేసీఆర్ పార్టీ లీడర్ల వద్ద ఆరా తీశారు. అనేక సంక్షేమ, ఆభివృద్ధి పథకాలను అమలు చేస్తుంటే.. పరిస్థితి ఎందుకు ఇట్లుందని అడిగి తెలుసుకున్నారు. ఉద్యమం నుంచి యూత్, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ టీఆర్ఎస్ వెంట ఉన్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు వారంతా సర్కార్​కు నెగెటివ్ గా ఉన్నట్లు  ప్రచారం జరుగుతోందని అన్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని, అవసరమైతే ఎల్​ఆర్​ఎస్​ ఫీజు తగ్గించే ఆలోచన చేద్దామని ఆయన అన్నారు. శనివారం ప్రగతిభవన్ లో కేసీఆర్ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దుబ్బాక బై ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్​పై మాట్లాడారు. రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్టుగానే రాబోయే ఎలక్షన్స్​ను అంతే సీరియస్​గా తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు నుంచే స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని ఆదేశించారు. టీఆర్​ఎస్​ వర్గాలు అందించిన సమాచారం మేరకు సమావేశం  వివరాలు ఇలా ఉన్నాయి..

కేంద్రం చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి

కేంద్రం చెప్పేది ఒకటి, చేసేది మరొకటని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా కూల్చాలనే దృష్టి తప్ప ప్రజా సమస్యలపై కేంద్రానికి దృష్టి లేదని ఆరోపించారు. కొత్త అగ్రి చట్టాల వల్ల రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఈ బిల్లులకు పార్లమెంట్ లో సపోర్టు చేయాలని చాలా మంది ఒత్తిడి చేసినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదని, అందుకే పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేశారని చెప్పారు. కేంద్రం తీసుకురానున్న నూతన విద్యుత్ చట్టం వల్ల రైతులకు మరిన్ని కష్టాలు వస్తాయని సీఎం అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండండి

అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. రోజూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లలో గెలుస్తామని, ప్రతి ఎమ్మెల్యేకు ఎన్నికల బాధ్యతలు ఉంటాయని చెప్పారు. దుబ్బాకలో మంచి మెజార్టీతో పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఎల్​ఆర్​ఎస్​ ఫీజు తగ్గింపుపై ఆలోచిద్దాం

ఎల్ఆర్ఎస్  ఫీజుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ఫీజులు తగ్గించే ఆలోచన చేస్తామని కేసీఆర్ ఎమ్మెల్యేలతో చెప్పారు. ఆస్తుల వివరాల సేకరణకు గడువు సరిపోదని,  మరికొన్ని రోజులు పెంచాలని ఎమ్మెల్యేలు కోరారు. రెవెన్యూ చట్టంపై ప్రజలకు అనుమానాలు ఉంటే తొలగించాలని నాయకులకు సూచించారు.