- ఎంపీడీవో నుంచి డీపీవో అకౌంట్లకు బడ్జెట్ వచ్చినా పైసల్ ఇయ్యట్లే
- నెలన్నర కిందనే నిధులు జమ
- ఆఫీసర్ల నిర్లక్ష్యంతో తప్పని ఇబ్బందులు
- రూ. 19,500 జీతానికి కోత
- చేతికొస్తుంది రూ.10 నుంచి 12 వేలే.. 20కి పైగా జిల్లాల్లో ఇదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు, ఆపరేటర్ల(ఓపీఎస్) పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామాల్లో పరిపాలన, రికార్డుల నిర్వహణ నుంచి ఆన్ లైన్ పనుల వరకు అన్నీ వాళ్లే చూడాలి. కానీ, వారి బతుకులు మాత్రం అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలైనా ఆఫీసర్లు, ఏజెన్సీల నిర్లక్ష్యంతో జీతాలు నేటికీ అందలేదు. గతంలో పీఆర్, ఆర్డీగా పని చేసిన డైరెక్టర్ సృజన రూ.19,500 జీతం ఫిక్స్ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కోతలు విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జీతాల్లో కోతలు..
ఆరు నెలలుగా ఓపీఎస్ లకు జీతాలు రావడం లేదు. అయితే జీతాల చెల్లింపు బాధ్యతను ఎంపీడీవో ఖాతాల నుంచి డీపీవో ఖాతాలకు మార్చారు. ఈ ప్రక్రియ జరిగి డీపీవో అకౌంట్లలో డబ్బులు జమ అయి నెలన్నర అవుతోంది. అయినా సరే ఇప్పటి వరకు సిబ్బంది ఖాతాల్లో జీతాలు పడలేదు. డబ్బులు అకౌంట్ లో ఉన్నా.. జీతాలు వేయడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో ఓపీఎస్ లకు రూ.19,500 జీతం చెల్లించాలని సర్క్యూలర్ ఇచ్చినా.. కొన్ని జిల్లాల్లో రూ.2,500 కట్ చేసి రూ.17,500 ఇస్తున్నారు.
రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో మాత్రం రూ.10 వేలు, రూ.12 వేలు, రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారని ఓపీఎస్లు వాపోతున్నారు. మిగిలిన డబ్బులు ఏమవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా స్థాయి అధికారులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై జీతాల్లో కోత విధిస్తున్నారని అంటున్నారు.
డీపీవో ఆఫీసుల్లోని సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, డీపీవోలు ఏజెన్సీలతో కలిసి నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక పోతే ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.19,500 కాకుండా, సగం జీతమే ఎందుకు ఇస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
తక్కువ జీతాలు ఎందుకు ఇస్తున్నారని ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిబ్బంది అధికారులను నిలదీస్తే, ఈ మూడు నెలలు ఇంతే వస్తాయి.. సర్దుకోవాలని, వచ్చే నెల నుంచి చూద్దామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని జిల్లాల్లో వెంటనే పూర్తి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
