కక్ష సాధింపులను సహించేది లేదు.. రాహుల్ ​గాంధీపై వేటు వేయడమేంది?

కక్ష సాధింపులను సహించేది లేదు..  రాహుల్ ​గాంధీపై వేటు వేయడమేంది?

కక్ష సాధింపులనుసహించేది లేదు

రాహుల్ ​గాంధీపై వేటు వేయడమేంది?

సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్​ నేతల ఫైర్​

హైదరాబాద్​, వెలుగు : రాహుల్​గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు. సామాన్యుల తరఫున ప్రశ్నించినందుకు ఆయనపై అనర్హత వేటు వేశారని దుయ్యబట్టారు. రాహుల్​పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్​ పార్టీ బుధవారం గాంధీభవన్​లో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​గౌడ్​ ఆధ్వర్యంలో నోటికి నల్లబట్టలు కట్టుకుని నేతలు దీక్షలో కూర్చున్నారు. ఏఐసీసీ ఇన్​చార్జ్​ కార్యదర్శి మన్సూర్​ అలీఖాన్​, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ అంజన్​కుమార్​ యాదవ్​, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ తదితరులు పాల్గొన్నారు. ఏపీకి చెందిన కాంగ్రెస్​ నేత శైలజానాథ్​ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. కక్షసాధింపులు సహించేది లేదని చెప్పారు. 

విద్వేషంపై రాహుల్​ పోరాటం: మన్సూర్​ అలీ ఖాన్​

దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు కాంగ్రెస్​ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరంతరం కృషి చేస్తున్నారని ఏఐసీసీ ఇన్​చార్జ్​ కార్యదర్శి ​మన్సూర్​ అలీ ఖాన్​ అన్నారు. విద్వేషంపై రాహుల్​ పోరాడుతున్నారని  తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు అడుగడుగునా మద్దతిస్తున్నదని ఆరోపించారు. కాగా, ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్​ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు. చిన్న తప్పుకు రాహుల్​ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించారని అన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ రెండూ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని, ఈసారి రాష్ట్రంలో కచ్చితంగా వందకుపైగా సీట్లు గెలుస్తామని ఆయన చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛా సమానత్వాలను కల్పించింది కాంగ్రెస్​ పార్టీనేనని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్​ అన్నారు. రాష్ట్రంలోనూ ఉపా కేసులతో పౌర హక్కుల కార్యకర్తలను సర్కారు వేధిస్తున్నదని ఆయన మండిపడ్డారు.

ఆరేండ్ల నిషేధమా?: జీవన్​ రెడ్డి 

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిం దని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. రాహుల్​ వ్యాఖ్యలకు రెండేండ్లు జైలు శిక్ష విధించడమే కాకుండా.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని, ఆరేండ్లు మళ్లీ పోటీ చేయకుండా నిషేధించారని అన్నారు.   గతంలో గవర్నర్​ ప్రసంగాన్ని అడ్డుకున్నారన్న నెపంతో కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, సంపత్​ కుమార్​పై కేసీఆర్​ సర్కార్​ వేటు వేసిందని తెలిపారు. ఉచిత కరెంట్​ విషయంలో పీపీఏ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని పీసీసీ చీఫ్​ అంటే.. దాన్ని బీఆర్​ఎస్​ నేతలు వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్​పై మోదీ సర్కార్​ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​అన్నారు. రాహుల్​ గాంధీ నాయకత్వం బలపడుతుండడంతోనే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిందని సంపత్​ కుమార్​ మండిపడ్డారు. రాహుల్​ గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన సేవలు, ప్రాణ త్యాగాలను చరిత్రలో లేకుండా చేసేందుకు మోదీ కుట్రలు చేస్తున్నరని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.