కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం : కేటీఆర్
  •  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింటెక్స్ ట్యాంకు ఓపెనింగ్​కే పరిమితం 
  • అంబర్ పేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

అంబర్​పేట, వెలుగు: ఆరు గ్యారంటీలను వంద రోజులలో నెరవేర్చకుంటే కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెట్టడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 14 ఏండ్లుగా 100 స్పీడ్ తో ప్రయాణించిన కారుకు కొంచెం సర్వీసింగ్ వచ్చిందని.. మళ్లీ అదే స్పీడ్ తో దూసుకెల్లడానికి రెడీగా ఉందన్నారు. అంబర్ పేట్ నియోజకవర్గ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ‘చే నంబర్’ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ గడ్డపై గులాబీ జెండాను ఎగరవేయాలని కోరారు. 

రూ500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారికి అమలు చేస్తామని మోసం చేస్తున్నారని ఆరోపించారు. 200 యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి.. 35 లక్షల కుటుంబాలకే అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. ఐదేండ్లుగా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేట్ నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. ఆయన సింటెక్స్ ట్యాంకుల ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా లోక్​సభ ఎన్నికలలో మోదీ మొఖం చూసి ఓటు వేయాలని ప్రజలను వేడుకోవడం సిగ్గుచేటన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మించి మోదీ మత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేటీఆర్​ను అడ్డుకున్న యూత్ కాంగ్రెస్

కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్ ను యూత్ కాంగ్రెస్​నేతలు అడ్డుకున్నారు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ నేతృత్వంలో ‘‘పదేండ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉసేత్తని కేటీఆర్.. గో బ్యాక్.. గో బ్యాక్ అని నినాదాలు చేశారు. సీఎం రేవంత్ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్న కేటీఆర్ ఖబర్దార్ అని హెచ్చరించారు.