కాగితాలకే పరిమితమైన మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల నిర్మాణం

కాగితాలకే పరిమితమైన మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల నిర్మాణం

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఎంతో కీలకమైన మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల నిర్మాణం కాగితాలకే పరిమితం అవుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్​ల గేట్లు ఎత్తి, మూసీ వరద పొటెత్తినప్పుడే వీటి ప్రస్తావన వస్తోంది. తగ్గుముఖం పట్టాక అధికారులు బ్రిడ్జిల విషయాన్ని పట్టించుకోవడం లేదు. మూడేండ్లుగా ఇదే సీన్​రిపీట్​అవుతోంది. భారీ వర్షాలకు మంగళ, బుధవారాల్లో మాదిరిగా 2020, 2021లో కూడా మూసీ నది పొంగింది. 2  బ్రిడ్జిల పై నుంచి ప్రవహించడంతో రెండింటిని క్లోజ్​చేశారు. అప్పుడే వీటి స్థానంలో కొత్తవి నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది జనవరి 29న ప్రభుత్వం నుంచి పరిపాలన పరమైన అనుమతులు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఇప్పటివరకు బ్రిడ్జిల నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం డీపీఆర్ లు కూడా రెడీ చేయలేదు.

త్వరలో చేస్తామని అధికారులు చెబుతున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే ఎండా కాలంలో నిర్మించి ఉంటే మరోసారి బ్రిడ్జిలు మునిగేవి కాదని నిపుణులు చెబుతున్నారు. అవసరం ప్రాంతాల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు నిర్మిస్తున్న ప్రభుత్వం, నిత్యం ఎంతో రద్దీగా ఉండే రూట్లను ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. వరదల టైంలో బ్రిడ్జిలు క్లోజ్​చేస్తే కిలోమీటర్ల మేర ట్రాఫిక్​నిలుస్తోందని, ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. మూసీకి వరదలొచ్చినప్పుడు జియాగూడ నుంచి పురానపూల్ వెళ్లే 100 ఫీట్ రోడ్డు కూడా మునుగుతోంది. దీనికి ఆనుకుని రిటైనింగ్ వాల్ నిర్మిస్తే ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. 

మిగిలిన చోటా ఇంతే..

మూసీ, ఈసీ నదులపై ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే చోట రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ వీటికి సంబంధించి ఇప్పటివరకు భూసేకరణ ప్రక్రియే పూర్తికాలేదు. రెవెన్యూ అధికారులు మొదట్లో హడావిడి చేసినప్పటికీ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అంతటితోనే వదిలేశారు. బ్రిడ్జిలు నిర్మించే చోట మాత్రమే కాకుండా, నదికి ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే ఈ సమస్య ఏర్పడింది. మూసారాంబాగ్, చాదర్ ఘాట్, ఇబ్రహీంబాగ్, అత్తాపూర్ లలో రూ.168 కోట్లతో జీహెచ్ఎంసీ, మిగతా 11 చోట్ల రూ.377 కోట్లను ఫండ్స్​ని హెచ్ఎండీఏ ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతిపాదించిన 15 బ్రిడ్జిలు నిర్మిస్తే ఈ జనానికి టైం, పెట్రోలు ఆదా అవుతాయి. 

ఇస్తాంబుల్, డల్లాస్ ఇదేనా?

ఇస్తాంబుల్, డల్లాస్  సిటీల్లాగా తయారు చేస్తామన్న ప్రభుత్వం ఎంతో అవపరమైన బ్రిడ్జిలను నిర్మించడం లేదు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని చెబు తున్నారు. మూసారాంబాగ్, చాదర్​ఘాట్ ఏరియాల్లో కొత్త బ్రిడ్జిలు ఎందుకు కట్టడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి తరువాత పట్టించుకోవడం లేదు. ప్రజలు కూడా ఎన్నికల టైంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిలదీయాలె.
‌‌- పద్మనాభరెడ్డి,  ఫోరం ఫర్​ గుడ్ గవర్నెన్స్​ సెక్రటరీ