గాలి ద్వారా కరోనా వేగంగా వ్యాపిస్తోంది.. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోండి

గాలి ద్వారా కరోనా వేగంగా వ్యాపిస్తోంది.. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోండి
  • తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

హైదరాబాద్: గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే ప్రమాదమని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా నెలకొనే ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వారాలుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజలు సహకరించకపోతే తెలంగాణ కూడా మహారాష్ట్ర లా మారే ప్రమాదం ఉందని ఆయన వెల్లడించారు. ముందు ముందు ఆస్పత్రుల్లో పడకలు కూడా దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఎవరికీ ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి పెట్టడం లేదని, కానీ తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.