ఆనందయ్య మందు తీసుకోవడం వల్లే కరోనా సోకలేదు

ఆనందయ్య మందు తీసుకోవడం వల్లే కరోనా సోకలేదు

తిరుపతి: కరోనా నివారణకు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన మందు తీసుకున్న వారిపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తి చేసింది. ఆ నివేదికను సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌‌కు పంపింది. కాగా.. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత  సీసీఆర్ఏఎస్ ఇచ్చే ఆదేశాల కోసం ఆయుర్వేద వైద్య బృందం ఎదురుచూస్తోంది. ఆనందయ్య మందు తీసుకున్న వారిలో ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌తో పాటు ఆయుర్వేద వైద్య నిపుణులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సంయుక్తంగా కమిటీగా ఏర్పాటైంది.
 ఈ కమిటీ సభ్యులు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న 570 మంది వివరాలను సేకరించి.. వారిలో 380 మందితో మాట్లాడారు. కరోనా రాకుండా ఉండేందుకు, పాజిటివ్‌ వచ్చాక మందు తీసుకున్న వారు, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన తరువాత మందు తీసుకున్న వారితో వివరంగా మాట్లాడారు. మందు తీసుకున్న తరువాత పాజిటివ్‌ ఎవరికైనా వచ్చిందా? లేదా?, అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటి వివరాలను సేకరించారు.
కమిటీ విచారణలో దాదాపు అందరూ ఆనందయ్య మందుకు అనుకూలంగానే అభిప్రాయం తెలియజేసినట్లు సమాచారం. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాతే కరోనా సోకలేదని పలువురు తెలిపారు. కాగా.. ఆనందయ్య మందు జంతువులపైనా ప్రయోగించేందుకు తిరుపతి సమీపంలోని సృజన లైఫ్‌ ల్యాబ్‌ ఎదురుచూస్తోంది. జంతువులపై ప్రయోగాలు చేసేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిపుణులతో చర్చించారు. సీసీఆర్‌ఏఎస్‌ నుంచి అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఎలుకలు, చుంచులకు కరోనా వైరస్‌ ఎక్కించి, ఆ తరువాత ఆనందయ్య మందును ప్రయోగించనున్నట్లు వివరించారు. ఇందుకుగాను సృజన లైఫ్‌ ల్యాబ్‌లో పరీక్షలకు అవసరమైన ఎలుకలు, చుంచులను సిద్ధం చేశారు.