అధికార పార్టీ కౌన్సిలర్ గా ఉన్నా అభివృద్ధి శూన్యం

అధికార పార్టీ కౌన్సిలర్ గా ఉన్నా అభివృద్ధి శూన్యం

నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాబోమని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా..అధికార పార్టీకి చెందిన 14మంది కౌన్సిలర్లు నాగార్జునసాగర్ లో క్యాంపు ఏర్పాటు చేశారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైఖరిపై వారు అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కౌన్సిలర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. కౌన్సిలర్లకు సమాచారం లేకుండానే అభివృద్ధి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా నిధులు కేటాయించడం లేదని..అధికార పార్టీ కౌన్సిలర్ గా ఉన్న వార్డు అభివృద్ధి శూన్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో పట్టణ ప్రగతి కింద వచ్చే నిధులను వార్డులకు కేటాయించేవారని, కానీ ఇప్పుడు ఆ ఫండ్స్‌‌‌‌కూడా రోడ్ల పనులు, అర్బన్‌‌‌‌‌‌‌‌ పార్కులకే ఖర్చు పెడుతున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు, పట్టణ ప్రగతి నిధులను లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేస్తున్నారన్నారు. పాలకవర్గంలో చర్చించకుండా, తనిఖీలు లేకుండా వచ్చిన ప్రతి పైసాను రోడ్లు, పార్కులకే పెట్టడం వల్ల వార్డుల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రిపేర్లకు పైసా ఉండడం లేదన్నారు. సీఎంతో మాట్లాడి వార్డుకు కోటి ఇప్పిస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ కూడా నెరవేరడం లేదని, దీంతో వార్డుల్లో జనాలకు ముఖం చూపించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు.