న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీల షేర్లను ట్రేడ్ చేయొద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) తన ఉద్యోగులకు తెలియజేసింది. ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి కొన్ని వివరాలు వీరికి అందుబాటులో ఉంటాయి. దీంతో ఈ కంపెనీల షేర్లు ఎలా కదులుతాయో ముందే తెలిసే ఛాన్స్ ఉంటుంది.
దీపంలో జాయిన్ అయ్యే ఏ ఆఫీసర్ అయినా ప్రభుత్వ కంపెనీల్లో తమకున్న హోల్డింగ్స్ గురించి తెలియజేయాలని ఈ డిపార్ట్‌మెంట్ తన ఇంటర్నల్ ఆర్డర్‌లో పేర్కొంది. అధికారులు అనుమతులు పొందాక తమ షేర్లను అమ్మేయాలని తెలిపింది.
ఫైనాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తున్న దీపం, ప్రభుత్వ కంపెనీల్లోని వాటాల అమ్మకాన్ని, స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్‌మెంట్‌ను, ప్రైవేటైజేషన్‌ను చూసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీఐసీ, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లలో వాటాలను అమ్మి రూ.5,160 కోట్లను ప్రభుత్వం సేకరించింది. 2023–24 లో రూ.16,507 కోట్లను, 2022–23 లో రూ.35,294 కోట్లను సేకరించింది.